భవితతో చెలగాటం!

12 Sep, 2014 01:04 IST|Sakshi

* ఏపీ ఉన్నత విద్యా మండలి ఉదాసీనతపై విమర్శలు
* సుప్రీంకోర్టులో సరైన వాదన వినిపించలేని వైనం
* ముందే అదనపు గడువు కోరిన తెలంగాణ సర్కారు
* ఆగ స్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేస్తామని అడ్డుపడిన ఏపీ
* తొలి విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తి, భారీగా మిగిలిపోయిన సీట్లు
* రెండో విడతకు కోర్టు నిరాకరణతో అడ్మిషన్లకు మూసుకున్న ద్వారాలు
 
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశాలపై పంతాలకు వెళ్లిన ఇరు ప్రభుత్వాల వైఖరి అంతిమంగా విద్యార్థులకు శాపంగా పరిణమించింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఇరు ప్రభుత్వ వర్గాలు ఆది నుంచీ ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించాయి. కొత్త రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత పలు అంశాలపై విధివిధానాల ఖరారులో జాప్యం అవుతున్నందున ఈసారి ఇంజనీరింగ్ అడ్మిషన్లను ఆలస్యంగా చేపట్టడానికి అనుమతించాలని తెలంగాణ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

ఈ విషయాన్ని ఏపీ ఉన్నత విద్యా మండలి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామంటూ ఏపీ కౌన్సిల్ ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. ఏటా పాటించే షెడ్యూల్‌ని అనుసరించి కోర్టు కూడా ఇందుకు సమ్మతించింది. తర్వాత ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ను చేపట్టారు. తీరా గడువులోగా తొలి విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తిచేయగలిగారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన చాలా మంది విద్యార్థులు కూడా మంచి కాలేజీలో.. మంచి కోర్సులో సీటు కావాలని కోరుకుంటూ రెండో విడత కౌన్సెలింగ్‌పై ఆసక్తిగా ఉన్నారు. రెండో విడతకు కోర్టు అనుమతి నిరాకరించడంతో అన్ని వర్గాలూ నిరాశకు గురయ్యాయి.

ఏపీ మండలి ఉదాసీనత వల్లే...
ఏటా ఎంసెట్‌కు రెండు, మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సాంకేతిక కారణాల దృష్ట్యా ఇది తప్పనిసరి అని తెలిసి కూడా ఏపీ మండలి ఆగస్టు 31 వ రకే గడువు కోరింది.   రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి విషయంలో ఏపీ మండలి గట్టి వాదనలు వినిపించలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ వేలాది సీట్లు మిగిలిపోయాయన్న విషయాన్నే నొక్కి చొప్పింది కానీ విద్యార్థులు నష్టపోతారన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

భారీగా మిగిలిపోయిన సీట్లు
తొలి దశ ఇంజనీరింగ్ ప్రవేశాలు గత నెల 30న ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 575 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,89,088 సీట్లు అందుబాటులో ఉండగా, 1,16,029 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. దీంతో 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 57,372 సీట్లు, తెలంగాణలో 15,677 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు కౌన్సెలింగ్‌లో పాల్గొన్న దాదాపు 4 వేల మందికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు.

అంటే వీరు తమ ర్యాంకుకు తగిన రీతిలో ఎక్కువ కళాశాలలకు ఆప్షన్లు పెట్టుకోలేదు. ఇప్పుడు వీరికి కూడా రెండో విడత అవకాశం లేకుండా పోయింది. ఇక జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని 174 కాలేజీలకు ప్రస్తుతం షరతులతో కూడిన అనుమతి ఉంది. వీటిలోనూ లక్షకుపైగా సీట్లు ఉంటాయి. వీటి భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ తప్పనిసరి. నష్టపోతున్న విద్యార్థులే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక్కటే ఇప్పుడు చివరి అవకాశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
విద్యార్థులకు ఎంత నష్టం..?
రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించకపోతే విద్యార్థులకు పలు రకాలుగా నష్టం జరుగుతుంది. తొలి విడతలో ఒక బ్రాంచీలో చేరిన వారు.. మరో బ్రాంచీకి మారే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే తొలివిడతలో మంచి కాలేజీలో సీటు దక్కక రెండో విడతలో కాలేజీ మారాలనుకుంటున్న వారికీ ఆ చాన్స్ లేకుండా పోతుంది. మేనే జ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ కూడా గందరగోళంగా మారింది. ఈ పరిస్థితులను ఊహించిన కొన్ని మేనేజ్‌మెంట్లు ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేశాయి.

ఈ మేరకు ఇప్పటికే లేఖలు అందజేశాయి. అయితే మిగతా కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ ఎలాగన్నది ప్రశ్నార్థకమైంది. ఇక ప్రమాణాలు పాటించలేదన్న కారణంగా అఫిలియేషన్ కోల్పోయి తొలి విడత కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్న 174 ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం తాజా నిర్ణయం శరాఘాతం వంటిదే. ఇప్పటికే షరతులతో కూడిన అనుమతి పొందడంతో రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొని విద్యార్థులను చేర్చుకోవాలని అవి భావించాయి. కానీ ప్రస్తుతం ఆ మార్గం లేక లబోదిబోమంటున్నాయి.
 
 రివ్యూ పిటిషన్‌పై ఆలోచన
 సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుంటాం. రివ్యూ పిటిషన్ వేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం.
 - ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి
 
 ఇదంతా ఏపీ కౌన్సిల్ నిర్వాకమే
 తె లంగాణ ప్రభుత్వం ఎక్కువ గడువు కావాలని అడిగినప్పుడు అవసరం లేకపోయినా ఏపీ కౌన్సిల్ ఇంప్లీడ్ అయింది. దాంతో ఇప్పుడు  విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితులతో ఇరు రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఏపీ కౌన్సిల్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
 - టీ మండలి చైర్మన్ పాపిరెడ్డి

మరిన్ని వార్తలు