ఏపీ: సెలెక్ట్‌ కమిటీకి నో

11 Feb, 2020 10:36 IST|Sakshi

ఫైలును తిప్పి పంపిన లెజిస్లేచర్‌ కార్యదర్శి

నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీల ఒత్తిడి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్‌ కమిటీని నియమించాలని చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ పంపిన ఫైలును లెజిస్లేచర్‌ కార్యదర్శి (ఇన్‌చార్జి)  పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్‌ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబు లెజిస్లేచర్‌ కార్యదర్శిని కలిసి సెలెక్ట్‌ కమిటీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్‌ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది.

ఉమ్మారెడ్డి అభ్యంతరం
సెలెక్ట్‌ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిందిగా చైర్మన్‌ షరీఫ్‌ లెజిస్లేచర్‌ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్‌ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్‌ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్‌ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్‌ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్‌ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్‌ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్‌ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్‌ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్‌ ఇక్బాల్‌లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం.  

మండలి చైర్మన్‌ నిర్ణయంతో వివాదం
పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్‌.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు