తెలంగాణలో ఆంధ్రాగీతం..

27 May, 2015 19:41 IST|Sakshi
తెలంగాణలో ఆంధ్రాగీతం..

మొయినాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా): తెలంగాణ రాష్ట్ర రాజధానికి చేరువలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఆంద్రప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ గీతాన్ని మాత్రమే ఆలకించటం తెలంగాణ పార్టీ క్యాడర్‌కు ఆగ్రహం తెప్పించింది. మహానాడు ప్రారంభం కాగానే "మాతెలుగుతల్లికి మంగళహారతులు" గీతాన్ని ఆలపించారు. ప్రధాన వేదికపై ఓవైపు తెలంగాణ చిహ్నమైన ఓరుగల్లు స్థూపం, మరోవైపు అమరావతి స్థూపాలను ఏర్పాటు చేశారు.

రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలోను అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతున్న పార్టీ నాయకులు ఏకంగా తెలంగాణ రాష్ట్రీయ గీతం "జయజయహే తెలంగాణ"ను ఆలకించకపోయినా వేదిక మీద ఉన్న తెలంగాణ నేతలెవరూ నోరు మెదపకపోవటాన్ని కింద కూర్చున్న క్యాడర్ జీర్ణించుకోలేకపోయారు. జాతీయ పార్టీగా ఎదుగుతామని ఓ వైపు ప్రకటించుకుంటూనే కనీసం అటు జాతీయ గీతం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో మహానాడు జరుపుకుంటూ ఆ రాష్ట్ర గీతాన్ని ఆలకించకపోవటంతో పలువురు తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు