పోరాట యోధుడికి ఘనస్వాగతం

8 Oct, 2015 01:54 IST|Sakshi
పోరాట యోధుడికి ఘనస్వాగతం

ప్రత్యేక హోదా ఆంధ్రహక్కు
 

దారి పొడవునా జననీరాజనం
అధిక సంఖ్యలో తరలివచ్చిన యువకులు, విద్యార్థులు, మహిళలు
కాకాని నుంచి    భారీ బైక్ ర్యాలీ
జనసంద్రంగా  గుంటూరు నగరం

 
పట్నంబజారు ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు గుంటూరు నగరానికి బుధవారం విచ్చేసిన వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. తొలుత ఆయన విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి గుంటూరుకు బయలుదేరారు. కాకాని వై జంక్షన్ వద్ద యువకులు, విద్యార్థులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ నసీర్‌అహ్మద్, కావటి మనోహర్‌నాయుడు, అబ్దుల్‌కర్నుమా, షేక్ గులాం రసూల్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి నందివెలుగురోడ్డు మీదుగా పాతగుంటూరుకు చేరుకుని శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆ ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువ, పూలమాలతో వై.ఎస్.జగన్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆలయం బయట వేచి ఉన్న వృద్ధులు, మహిళలను జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్దకు రాగానే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత పెరికల రవికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లు, రెల్లి సంఘం నేత సోమి కమల్ నేతృత్వంలో సంఘ సభ్యులు ఆయన్ను కలిశారు.

పూలమాలలు వేసి సత్కరించారు. అక్కడ నుంచి బయలుదేరిన వై.ఎస్.జగన్ కాన్వాయ్ పాతబస్టాండ్ సెంటర్, జిన్నాటవర్, మార్కెట్, హిందూకళాశాల కూడలి, మూడుబొమ్మల సెంటర్, నగరంపాలెం, మెడికల్ హాల్‌రోడ్డు, చుట్టుగుంట సెంటర్‌కు చేరుకుంది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వై.ఎస్.జగన్ వాహనం ఆపి వారిని ఆప్యాయం పలకరించారు. అనంతరం అక్కడ నుంచి దీక్ష శిబిరానికి ఆశేష జనవాహిని నడుమ చేరుకున్నారు.
 
కదిలిన 52 డివిజన్లు...
గుంటూరు నగరంలోని 52 డివిజన్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీక్షకు మద్దతుగా నినదించారు. ఆయా డివిజన్‌ల అధ్యక్షులు, నగర పార్టీ అనుబంధ విభాగాల నేతల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల నుంచి ర్యాలీగా దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు.
 
ఆకట్టుకున్న ఫ్లెక్సీలు
దీక్షా శిబిరం వద్ద వై.ఎస్.జగన్‌కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. పార్టీ ఎమ్మెల్యే, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమిళనాడు తరహాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలోని పలు కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.
 
ప్రత్యేక ఆకర్షణగా డానియేల్
గుంటూరు మెడికల్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో గొర్రె డానియేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో కూడిన ఎలక్ట్రికల్ బోర్డును ఒంటిపై ధరించి, వైఎస్సార్ సీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాను ఏర్పాటు చేసుకుని వేదిక అంతా కలియ తిరిగారు. అక్కడికి వచ్చిన వారి దృష్టిని ఆకర్షించారు.
 
ఆటాపాటతో ఉద్యమ స్ఫూర్తి
గుంటూరు ఈస్ట్ : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరం వద్ద పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో వంగపండు ఉషా బృందం ఇచ్చిన ప్రదర్శన ప్రజల్లో మరింత ఉద్యమ స్ఫూర్తిని పెంచింది. కాళ్లకు గజ్జలు కట్టుకుని, భుజాన గొంగళి ధరించి పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రత్యేక హోదా అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. హోదా కోసం వై.ఎస్.జగన్ చేస్తున్న పోరాటాలు వివరించారు. అలాగే చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న తీరును తెలియజేశారు.
 
జగన్ దీక్షతో ఢిల్లీ పీఠం కదులుతోంది

ఎస్.వి.యూనివర్సిటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును ఒక ఆట ఆడించారు. ఆరోజులను చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలి. జగన్ ఒక సింహం లాంటివాడు. ఆయన్ను చూస్తే టీడీపీ నాయకులకు దడపుడుతుంది. ట్విట్టర్ పిట్ట లోకేష్‌కు జగన్‌ను విమర్శించే అర్హత లేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అయితే ఇప్పుడు లోకేష్ ఇసుక, మద్యం, సంక్షేమ పథకాలు అమలులో మాఫియాగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్న దీక్షతో ఢిల్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పీఠాలు కదలడం ఖాయం.
 - నారాయణ స్వామి, ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు
 
బలిదాన వీరులకు ఘననివాళి
గుంటూరు మెడికల్ : ప్రత్యేక హోదా కోసం బలిదానాలు చేసిన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు నగరంలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం బలిదానాలు చేసిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వల్లం రమణయ్య, లక్ష్మయ్య, కృష్ణాజిల్లాకు చెందిన సిరిపురపు ఉదయభాను, వైఎస్సార్ జిల్లాకు చెందిన గనుముల లోకేశ్వరరావు, తిరుపతికి చెందిన మునుకోటికి నివాళులర్పించారు.
 
వీరాంజనేయ స్వామి ఆశీస్సులు పొందిన జగన్

బ్రాడీపేట(గుంటూరు) : పాత గుంటూరులోని శ్రీ వీరాంజనేయస్వామివారి దేవస్థానంలో స్వామి వారిని వై.ఎస్.జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఆలయ కమిటీ కార్యదర్శి కాసుల సాంబశివరావు, విశాఖ శ్రీ శారద పీఠ ధర్మాధికారి జి.కామేశ్వర శర్మ తదితరులు స్వాగతం పలికారు.
 
 

మరిన్ని వార్తలు