‘అన్న’మో రామచంద్రా!

17 Jul, 2018 07:30 IST|Sakshi

అన్న క్యాంటీన్‌కు పేదల తాకిడి

గంటన్నర ముందుగానే బంద్‌

అందరికీ సరిపడ ఆహారమందించడంలో విఫలం

ఆకలితో వెనుదిరిగిన వందలాదిమంది పేదలు

అనంతపురం న్యూసిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్‌లో పేదలకు సరిపడ భోజనం దొరకడం లేదు. అల్పాహారమైనా, భోజనమైనా ఐదు రూపాయలకే అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా డిమాండ్‌ మేరకు ఆహారం అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనంతపురంలోని బళ్లారి బైపాస్‌ సర్కిల్‌లో ఆదివారం అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప ప్రారంభించారు. ప్రారంభించి 24 గంటలు కాకముందే క్యాంటీన్‌లో అన్నం దొరక్క ప్రజలు అవస్థలు పడటం చర్చనీయాంశమైంది.

సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకే క్యాంటీన్‌లో భోజనం అయిపోయింది. దీంతో ప్రజలు నిర్వాహకులను నిలదీశారు. కనీసం 200 మందికి కూడా భోజనం పెట్టకుండా ఏవిధంగా అయిపోయిందంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి ‘అన్నా క్యాంటీన్‌’ను పరిశీలించారు. ప్రజలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. నిర్వాహకులు 12 గంటలకే భోజనం ఏర్పాటు చేశామని, గంటలోనే 300 మందికి ఇచ్చామని సమాధానం చెప్పారు. మెనూ బోర్డులో ఉదయం 7.30 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలు, డిన్నర్‌ 7.30 నుంచి 9.00 గంటలలోపు భోజనాలు అందజేస్తారని ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు ప్రారంభించామని చెప్పారో అర్థం కావడం లేదు.

ఇంటి నుంచి తీసుకురాలేదు
రోజూ బయట తినాలంటే రూ.40 ఖర్చు అయ్యేది. అన్నా క్యాంటీన్‌లో రూ. 5కే భోజనం ఇస్తామని చెప్పారు. చాలా సంతోషమేసింది. తక్కువ ధరకే భోజనం చేయవచ్చనుకున్నా. ఇక్కడ చూస్తే మధ్యాహ్నం 1.30 గంటలకే అయిపోయిందన్నారు.  – కొండమ్మ, చిరు వ్యాపారి

బోర్డు చూసి షాక్‌ అయ్యా
అన్నా క్యాంటీన్‌లో రూ.5కే మంచి భోజనం పెడుతున్నారని విన్నా. ఎంతో ఆశతో ఇక్కడి వచ్చా. తీరా చూస్తే అయిపోయిందని బోర్డు తిప్పేశారు. ప్చ్‌ ఏం చేద్దాం. మాలాంటోళ్లకు మామూలే కదా?        
– రామకృష్ణ

తాగుబోతులకు అడ్డా
అన్నా క్యాంటీన్‌ తాగుబోతులకు అడ్డాగా మారుతోంది. క్యాంటీన్‌ ఎదురుగా వైన్‌ షాపు ఉంది. కొందరు మద్యం తాగి నేరుగా క్యాంటీన్‌లో భోజనం కోసం వస్తున్నారు. ఉదయం ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి క్యాంటీన్‌లోనే పడుకున్నాడు. చివరకు సిబ్బంది మోసుకుని బయటకు పంపారు. 

మరిన్ని వార్తలు