ఆ ఎస్పీపై బదిలీ వేటు

17 Jul, 2018 07:25 IST|Sakshi

పరాయి మహిళతో రాసలీలల వీడియోలు...

బెంగళూరు రూరల్‌ ఎస్పీ భీమాశంకర్‌పై చర్యలు?

డీసీఎం పరమేశ్వర్‌తో డీజీపీ భేటీ త్వరలో నివేదిక

దొడ్డబళ్లాపురం: పవిత్రమైన ప్రజా రక్షక వృత్తిలో ఉంటూ పరాయి మహిళతో రాసలీలల వీడియోలు బయటపడడంతో తీవ్ర విమర్శల పాలవుతున్న బెంగళూరు రూరల్‌ జిల్లా ఎస్పీ భీమాశంకర్‌ గుళేద్‌ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ (వేకెన్సీ రిజర్వు) చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టీపీ శివకుమార్‌ను రూరల్‌ ఎస్పీగా నియమించారు. మరోవైపు గుళేద్‌ వ్యవహారం సోమవారమూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన దావణగెరెలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఫోటో స్టూడియో నిర్వాహకురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఆదివారం వెలుగు చూడడం తెలిసిందే. ఆ వీడియోలు ఒక ప్రైవేటు టీవీ న్యూస్‌చానెల్లో రెండు రోజులుగా ప్రసారమవుతున్నా ఇప్పటి వరకూ ఆ ఎస్పీ కాని, పోలీసు పెద్దలు కానీ నోరు మెదపలేదు. అయితే సోమవారం ఒత్తిడి పెరగడంతో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి జి.పరమేశ్వర్, డీజీపీ నీలమణి రాజును పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

మహిళ, భర్త పరస్పర విమర్శలు
వీడియోలో ఎస్పీతో ఉన్న మహిళ మాత్రం తన భర్త తనను వేధించేవాడని, అందుకే ఈ విధంగా రచ్చకీడుస్తున్నాడని,ఎస్పీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈమె భర్త తనకు ఎస్పీ నుంచి, తన భార్య నుండి ప్రాణహాని ఉందని రక్షణ కావాలని కోరుతున్నాడు. ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని, తక్షణం ఆయనపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళా సిబ్బందికి ఒక భరోసా కల్పించాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండు చేస్తున్నారు. మరోవైపు దావణగెరెలో ఎస్పీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఒక్కొక్కరూ బయటపెడు తున్నారు. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే ఎస్పీ అనేకమంది అమాయకులను కేసుల్లో ఇరికించారని ఆరోపణలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు