విదేశీ మోజులో మరో మోసం

14 Jun, 2018 10:21 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులను విచారిస్తున్న సీఐ మళ్ల శేషు

లక్షల్లో దోచుకున్న ఏజెంట్లు

మోసపోయిన నిరుద్యోగులు

సింగపూర్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పట్టుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు

విదేశీ మోజులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన బుధవారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ సీఐ మళ్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం..
సాక్షి, ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ) : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన 9 మంది యువకులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌  అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరంతా సింగపూర్‌లో ఆల్ఫిన్‌ బిల్డర్స్‌ కనస్ట్రక్షన్‌ పీటీఈ లిమిటెడ్‌లో ఉద్యోగాలొచ్చాయంటూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజిటింగ్‌పై విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఆసియా విమానంలో కౌలలాంపూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బోర్డింగ్‌ పూర్తయిన తరువాత వీరిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనిఖీలు చేశారు. వర్క్‌ ఆర్డర్‌పై తొమ్మిది మందికి ఒకే నంబర్‌ ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు వర్క్‌ ఆర్డర్‌ నంబర్‌ ఉండాలి. అందరికి ఒకే నంబర్‌ ఉండడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఖంగుతిన్నారు. తామంతా మోసపోయామని లబోదిబోమన్నా రు. బాధితులను 6 గురు సబ్‌ ఏజెంట్లు మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తు తం ఏజెంట్ల ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి ఉన్నాయి. సీహెచ్‌ శ్రీనివాస్‌ అనే ఏజెంట్‌కు నరేష్, ప్రసాద్‌లు రూ.80 వేల చొప్పున ముట్టజెప్పారు. శంకర్‌ అనే ఏజెంట్‌కు తెడ్డు గంగాధర్‌ రూ.70 వేలు, రాజేష్‌కు కాశీమని శ్రీనివాస్, అలువల మల్లేష్‌లు రూ.70 వేల చొప్పున ఇచ్చారు. ఏజెంట్‌ మురళీకి యర్ల శ్రీను 65 వేలు, ఏజెంట్‌ పోతన్నకు దేవల గంగాధర్‌ రెడ్డి, షేక్‌ సైదుళ్ల రూ.65 వేలు, ఏజెంట్‌ ఝాన్సీకి దత్తరావు రూ.65 వేలు సమర్పించుకుని మోసపోయారు. కాగా.. సింగపూర్‌లో ఆల్ఫిన్‌ బిల్డర్స్‌ సంస్థ లేదని ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


నిరుద్యోగులకు కౌనెల్సింగ్‌
బాధితులకు సీఐ మళ్ల శేషు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విదేశీ ఉద్యోగాల మోజులో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వేర్వేరు ఏజెంట్ల ద్వారా వచ్చినా.. వర్క్‌ ఆర్డర్‌ మాత్రం ఒకే వ్యక్తి వద్ద నుంచి వచ్చినట్టు గుర్తించామన్నారు. ఈ మోసానికి మూలమైన ఏజెంట్‌ను పట్టుకుంటామని విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు