‘పోలవరం’లో మరో బాగోతం

14 Jul, 2018 02:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

     రెండు బ్రిడ్జిల పనుల్లో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.29.40 కోట్లు 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ‘జాతీయ రహదారి–16’ను క్రాస్‌ చేసే రెండు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ.29.40 కోట్లు అదనంగా చెల్లించడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఆ పనులు వారికి అప్పగించినప్పుడు వాటి విలువ రూ.39.35 కోట్లు కావడం గమనార్హం. అంటే ఏడాదిలోనే ఆ పనుల అంచనా వ్యయాన్ని 75 శాతం పెంచేశారు. దీన్నిబట్టి కమీషన్లు ఏ స్థాయిలో చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. 

పనులు చేయని కాంట్రాక్టర్లకు వత్తాసు 
తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి–16ను పోలవరం ఎడమ కాలువ నాలుగు ప్రాంతాల్లో క్రాస్‌ చేస్తుంది. ఈ ప్రదేశాల్లో కాలువపై ఆరు వరుసలతో బ్రిడ్జి, రెండు వరుసలతో సర్వీసు రోడ్లు నిర్మించాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు గత ఏడాది జూలైలో గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద(ఎడమ కాలువపై 41.560 కి.మీ. వద్ద) రూ.16.05 కోట్లతో, మురారి వద్ద (ఎడమ కాలువపై 33.599 కి.మీ. వద్ద) రూ.22.17 కోట్లతో, శంఖవరం మండలం ఆరేపల్లి వద్ద(ఎడమ కాలువపై 93.7 కి.మీ. వద్ద) రూ.21.07 కోట్లతో, తుని మండలం కోనేరు వద్ద(ఎడమ కాలువపై 103.658 కి.మీ. వద్ద) రూ.22.52 కోట్లతో జాతీయ రహదారి–16ను కలుపుతూ ఆరు వరుసల బ్రిడ్జిలు, బ్రిడ్జికి రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

మల్లేపల్లి బ్రిడ్జి పనులను 2.99 అధిక(ఎక్సెస్‌) ధరకు అంటే రూ.16.53 కోట్లకు తన సన్నిహిత కాంట్రాక్టర్‌కు, మురారి బ్రిడ్జిని 2.97 ఎక్సెస్‌కు అంటే రూ.22.87 కోట్లకు మరో సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేలా కీలక మంత్రి చక్రం తిప్పారు.  అయితే సన్నిహిత కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పట్లో టెండర్లను రద్దు చేశారు. గత నెల 28న ఆరేపల్లి, కోనేరు బ్రిడ్జిలకు గతేడాది జూలైలో నిర్ణయించిన అంచనా వ్యయంతోనే జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం మల్లేపల్లి, మురారి బ్రిడ్జిలు ఆరు నెలల్లో పూర్తి కావాలి.

నిబంధనల మేరకు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన కీలక మంత్రి  వారికి అదనపు బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కీలక మంత్రి దన్నుతో మల్లేపల్లి బ్రిడ్జి కాంట్రాక్టర్‌ రూ.13.32 కోట్లు.. మురారి బ్రిడ్జి కాంట్రాక్టర్‌ రూ.16.08 కోట్లు అదనంగా చెల్లించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.  దీంతో కీలక మంత్రి ఒత్తిడి మేరకు ఆ కాంట్రాక్టర్‌లకు రూ.29.40 కోట్లను అదనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిఫలంగా కీలక మంత్రికి  రూ.20 కోట్లు మేర కమీషన్లు దక్కనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు