Sound Party Review: ‘సౌండ్‌ పార్టీ’ మూవీ రివ్యూ

24 Nov, 2023 06:57 IST|Sakshi
Rating:  

టైటిల్‌: సౌండ్‌ పార్టీ
నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్,రేఖ పర్వతాల తదితురులు
నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర 
సమర్పణ : ‘పేపర్‌ బాయ్‌’ ఫేమ్‌ జ‌య‌శంక‌ర్‌
రచన - ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి 
సంగీతం: మోహిత్ రెహమానిక్ 
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్‌: జి.అవినాష్‌
విడుదల తేది: నవంబర్‌ 24, 2023

బిగ్‌బాస్‌ విజేత వీజే సన్నీ, యంగ్‌ హీరోయిన్‌ హృతికా శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం సౌండ్‌ పార్టీ. పేపర్‌ బాయ్‌తో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ జయశంకర్‌ తన చిరకాల మిత్రుడు సంజయ్‌ శేరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అలా వీరి కాంబినేషన్‌లో సౌండ్‌ పార్టీ తెరకెక్కింది. అమాయకులైన తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథాచిత్రమిది. మరి ఈ కథ జనాలకు కనెక్ట్‌ అయిందా? ప్రేక్షకులను మేరకు మెప్పించింది? బాక్సాఫీస్‌ దగ్గర ఏ రేంజ్‌లో సౌండ్‌ చేయనుంది? అనేది రివ్యూలో చూసేద్దాం..

కథేంటంటే..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్‌ కుమార్‌(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్‌ కుమార్‌(శివన్నారాయణ)..కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు కుబేర్‌ కుమార్‌కు పరిచయం ఉన్న సేటు నాగ భూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’అనే హోటల్‌ని ప్రారంభిస్తారు.

అది ప్రారంభంలో బాగానే నడిచినా..డాలర్‌ కుమార్‌ ప్రియురాలు సిరి(హృతిక శ్రినివాస్‌) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్‌ కుమార్‌ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకిని వెళ్తే...రూ. 2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు.  ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఆ రెండు కోట్ల రూపాయలు ఏం అయ్యాయి? కోటీశ్వరులు కావాలనే వారి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులొ చాలా సినిమాలే వచ్చాయి. సౌండ్‌ పార్టీలో కొత్తదనం ఏంటంటే..బిట్‌కాయిన్‌ అనే పాయింట్‌తో కామెడీ పండించడం. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు సంజ‌య్ శేరి. అయితే పేపర్‌పై రాసుకున్న కామెడీ సీన్‌ని తెరపై అదే స్థాయిలో చూపించి, రక్తికట్టించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్‌ నవ్వించే విధంగానే ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు కావాలనే కథకు అతికినట్లుగా అనిపిస్తుంది.

కుబేర్‌ కుమార్‌ ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్‌ సీన్‌తోనే కథనం ఎలా సాగబోతుందో తెలియజేశాడు. డబ్బు కోసం తండ్రి కొడుకులు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్‌ మాత్రం కథకు అతికినట్లుగానే అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల  చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోయిన్‌ ఇంటికి వెళ్లిన హీరో..ఆమె పేరెంట్స్‌ దొరికిపోయినప్పుడు చేసే కవరింగ్‌.. అలాగే తండ్రీకొడుకులు అప్పు తీసుకున్న తీరు.. రొటీన్‌గా అనిపిస్తాయి. సీన్ల పరంగా చూస్తే ఫస్టాఫ్‌ నవ్వుకోవచ్చు. కానీ కథనం మాత్రం రొటీన్‌గా ఉంటుంది.

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపించినా.. నవ్వులు పూయిస్తాయి. పత్తి సతీష్‌గా చలాకీ చంటి ఒకటిరెండు సీన్లలో కనిపించినా..బాగానే నవ్వించాడు.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఓ సన్నివేశానికి చేసిన స్ఫూప్‌ సినిమాకు ప్లస్‌ అయింది. బిట్‌ కాయిన్‌ ఎపిసోడ్‌ కథను మలుపు తిప్పుతుంది.  లాజిక్కులను పక్కకి పెట్టి.. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ‘సౌండ్‌ పార్టీ’ అలరిస్తుంది. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం శివన్నారాయణ, సన్నీ పాత్రలే. కుబేర్‌ కుమార్‌ పాత్రలో శివన్నారాయణ, డాలర్‌ కుమార్‌ పాత్రలో సన్నీ అదరగొట్టేశారు. వీరిద్దరి  ఫాదర్‌-సన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. సిరి పాత్రకు హృతిక న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే. ఫాదర్‌-సన్‌ కెమిస్ట్రీ ముందు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది.

శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నవ్వించాడు.  ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించాడు. హీరో చెల్లెలుగా రేఖ పర్వతాల తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది.  ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల  పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మోహిత్ రెహమానిక్  నేపథ్య సంగీతంతో పాటు పాటలు బాగున్నాయి. శ్రీనివాస్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు