ఎక్కడుంటే అక్కడే రేషన్‌..

12 Aug, 2019 11:10 IST|Sakshi

ఏపీ, తెలంగాణ మధ్య పోర్టబిలిటీ విధానం ప్రారంభం

ఇకపై తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే సౌలభ్యం

 జిల్లాలో 80 వేల కుటుంబాలకు పైగా వలసలు

 పోర్టబిలిటీతో వారికి  మరింత ప్రయోజనం    

బొబ్బిలి: బతుకుదెరువు కోసం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు, కుటుంబాలు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేషన్‌ కార్డు తొలగింపు భయమే ‘రద్దయిపోయింది’. ఇప్పటి వరకూ అంతర్‌ జిల్లాల స్థాయిలోనే అంతంత మాత్రంగా ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించి, ఏపీ లబ్ధిదారులకు తెలంగాణలో రేషన్‌ ఇచ్చే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. దీని వల్ల రేషన్‌ కార్డు రద్దవుతుందనే ఇబ్బందులు లేని వ్యవస్థ మొదలుకానుంది.

కార్డు డిలీట్‌ కష్టాలకు ఇక చెక్‌..
జిల్లాలో 15 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా 846 అన్నపూర్ణ కార్డులుండగా.. 1,117 మంది లబ్ధిదారులన్నారు. అలాగే అంత్యోదయ కార్డులు 84,972 ఉంటే అందులో లబ్ధిదారులుగా 2,34,076 మంది ఉన్నారు. తెల్ల రేషన్‌ కార్డులు 6,27,235 ఉండగా, లబ్ధిదారులు 18,25,778 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా దారిద్య్ర రేఖ దిగువన జీవిస్తున్న వారికి తెల్ల రేషన్‌ కార్డులు 7,13,053 ఉన్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు 80 వేలకు పైగానే ఉన్నాయి. అనేక కుటుంబాలు.. పిల్లలను కూడా అక్కడే చదివిస్తున్నాయి. వలస వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పటికీ రెండుమూడు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి రేషన్, పింఛన్లు తీసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి రాలేని వారి కార్డులు కూడా డిలీట్‌ అయిన సందర్భాలున్నాయి.

కూలీలకు మరింత ప్రయోజనం..
కొత్తగా తీసుకొచ్చిన పొర్టబిలిటీ విధానాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించడం రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూరుస్తుంది. దీని వల్ల ఆయా కుటుంబాలు ఎక్కడుంటే అక్కడే రేషన్‌ తీసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల వలస కూలీలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే కొంత మంది నాలుగేసి నెలల పాటు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. వారు ఇకపై అక్కడ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోకుండా, రేషన్‌ ద్వారానే బియ్యం, ఇతర సరుకులు తీసుకోవచ్చు.

గతంలో జిల్లా వరకే..
రాష్ట్రంలో 2015లో ఈ పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించినా కేవలం మండలాలకే పరిమితమై ఉండేది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఇతర మండలాల కార్డులను అనుసరించి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ, అంతర్‌రాష్ట్ర పోర్టబిలిటీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నూతనంగా అమల్లోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు