ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

27 Mar, 2015 15:57 IST|Sakshi
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. పలు ఆసక్తికర పరిణామాల మధ్య 15 రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2015-16 వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. దీనిపై మొత్తం 61.40 గంటలపాటు చర్చ జరిగింది. 139 ప్రశ్నలు, రెండు స్వల్పకాలిక చర్చలు, రెండు ప్రభుత్వ స్టేట్మెంట్లతోపాటు 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపిన విషయాల్ని వెల్లడించిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని నిరవధింకంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

చివరిరోజు కీలకమైన అప్రాప్రియేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చూపిన లెక్కల్లోని తప్పుల్ని ఆధారాలతోసహా సభ ముందుంచారు. చర్చ అనంతరం అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం లభించింది.

 

అంతకుముందు జరిగిన చర్చలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్పీకర్ను దింపేయాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోలేదని, సభ జరిగిన తీరు, చోటు చేసుకున్న వ్యవహారాలు తమను తీవ్రంగా బాధపెట్టాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో తాము బాధపడకుండా చూసుకుంటారనే విశ్వాసంతోనే అవిశ్వాసం తీర్మానం ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు