చంద్రబాబు పర్యటనపై రాజధాని రైతుల నిరసన

27 Nov, 2019 13:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటనపై అసైన్డ్‌ భూముల రైతులు అభ్యంతరం వ్యక‍్తం చేశారు. బాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు పాతి నిరసన తెలిపారు. రాజధాని పేరుతో చంద్రబాబు అసైన్డ్‌ భూముల రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల రైతులు బుధవారం రాయపూడిలో నిరసనకు దిగారు.  ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ...‘ అసైన్డ్‌ భూములకు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు మరొక ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు దళితలకు అన్యాయం చేశారు. ఇది అన్యాయం అని అడిగితే గత ప్రభుత్వం మాపైన తప్పుడు కేసులు పెట్టింది. 

రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల తీవ్రమైన వివక్ష చూపింది. అసైన్డ్‌ భూముల రైతులకు చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు బినామీలు అసైన్డ్‌ భూములు కొనుక్కున్న తర్వాత దళితులు సాగు చేస్తున్న అసైన్డ్‌  భూములను ల్యాండ్‌ పూలింగ్‌లోకి తీసుకున్నారు. మాకు జరిగిన అన్యాయంపై ఎస్సీ కమిషన్‌ దగ్గరకు వెళ్లాం. పుండు మీద కారం చల్లినట్లు ...చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు. రాజధానిలో అడుగుపెట్టే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారు. ఇప్పటికైనా చంద్రబాబు దళితుల పట్ల తప్పు చేశానంటూ...క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి.’ అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు