ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

20 May, 2019 17:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రీపోలింగ్‌ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు 13 జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల క్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 25వేలమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌ ప్రక్రియకు 200మంది పరిశీలకులను నియమించింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్‌ యంత్రాలను లాటరీ విధానంలో తీస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్పులను లెక్కించడం పూర్తయిన తరువాతనే ఆ నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్‌ యంత్రాల్లో స్లిప్పులు లెక్కించడానికి సమయం పట్టనుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల వెల్లడికి ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితాలు తెలిసిపోతాయి.

మరోవైపు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ చేశారు. ‘కౌంటింగ్‌లో వీవీ  ప్యాట్‌లో స్లిప్పులు, ఫారం-17సీ లెక్కలతో సరిపోవాలి. కౌంటింగ్‌కు ముందు మాక్‌ పోల్‌ రిపోర్టు కూడా లెక్కలతో సరిపోవాలి. వీవీ ప్యాట్‌ స్లిప్పులు ఈవీఎం ఓట్లతో సరిపోవాలి. ఎన్నికల లెక్కింపులో సందేహాలు వస్తే పోలింగ్‌ డైరీ రిపోర్టుల ఆధారంగా నిర్ణయం ఉంటుంది. సాంకేతిక సమస్యలు, వివాదాలు తలెత్తిన చోట ఫలితాలపై ఈసీదే నిర్ణయం. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు కౌంటింగ్‌ చివర్లో జరుపుతాం. ఓట్ల లెక్కింపుపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోదే నిర్ణయాధికారం. ఏదైనా కేంద్రంలో తక్కువ మార్జిన్‌ వస్తే రీకౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్‌ నిర‍్ణయాధికారం ఆర్వో, అబ్జర్వర్లదే’  అని తెలిపారు.

మరిన్ని వార్తలు