‍నెత్తిన పాలు పోశారు..!

12 Jul, 2019 07:17 IST|Sakshi

పాడి రైతుకు బాసట

లీటర్‌కు రూ.4 బోనస్‌  

అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఏపీ డెయిరీకి ఇక మంచిరోజులు

‘అనంత’లో క్షీర విప్లవానికి నాంది 

గతం అంధకారం 
► చంద్రబాబు హయాంలో పతనావస్థలో డెయిరీలు 
► 60వేల లీటర్ల నుంచి 4 వేల లీటర్లకు పడిపోయిన పాల సేకరణ 
► ఐదేళ్లలో 33 బీఎంసీలు, 410 పాల సేకరణ కేంద్రాల మూత 

రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతులకు చేయూత నిచ్చారు. లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ప్రకటించి 2.90 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. 5 వేల లీటర్ల సేకరణతో పతనావస్థకు చేరుకున్న ఏపీ డెయిరీకి జీవం పోశారు. కరువు జిల్లా ‘అనంత’లో క్షీర విప్లవానికి నాంది పలికారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని అసెంబ్లీ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు.    – అనంతపురం అగ్రికల్చర్‌ 

పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడు ఇంట కరువే ఉండదట 

ఇది కంబదూరులోని ఏపీ డెయిరీ. గ్రామీణ ప్రాంత రైతులను పాడిపరిశ్రమలో ప్రోత్సహించేందుకు వైఎస్సార్‌ హయాంలో రూ.30లక్షలతో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది రైతులు కొత్తగా పాడిపరిశ్రమవైపు దృష్టి సారించారు. రోజూ 1500 లీటర్లకు పైగా పాలు డెయిరీకి వచ్చేవి. నిర్వహణ సరిగా లేకపోవడం.. గత ప్రభుత్వాలు  పట్టించుకోకపోవడంతో 8 ఏళ్ల క్రితం డెయిరీ మూతపడింది. దీంతో రైతులు పాలను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

‘అనంత’.. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. తీవ్ర వర్షాభావంతో పంటలు పండక అప్పుల పాలవుతున్న రైతులు.. ప్రత్యామ్నాయంగా పాడితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యమున్న పాడి పరిశ్రమను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటును ప్రోత్సహిస్తూ ప్రభుత్వ డెయిరీకి పాడె కట్టారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలు...ఏపీ డెయిరీ దుస్థితి స్వయంగా తెలుసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే పాడి రైతులుకు మేలు కలిగేలా లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో ఆరు నెలలకు రోజువారీ పాల సేకరణ 50 వేల లీటర్లు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల జిల్లా పాడి రైతులకు సంవత్సరానికి రూ.40 నుంచి రూ.50 కోట్లు మేర అదనపు ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. 

వైఎస్సార్‌ హయాంలో పాల వెల్లువ 
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు.  50 శాతం రాయితీతో పశుక్రాంతి పథకం కింద మేలుజాతి ఆవులు, గేదెలు అందించి క్షీర విప్లవానికి నాంది పలికారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 42 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు (బీఎంసీ) పనిచేస్తుండగా... వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్ల ద్వారా రోజుకు 70 వేల లీటర్లు పాల సేకరణ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.  సేకరించిన వేలాది లీటర్ల పాలను జిల్లాతో పాటు హైదరాబాద్‌కు రవాణా చేసి లాభాలబాట పట్టింది.  కానీ... వైఎస్సార్‌ హఠాన్మరణం తర్వాత గద్దెనెక్కిన వారు పాడి పరిశ్రమను విస్మరించారు. ప్రోత్సాహకాన్ని సైతం క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో రైతులు ప్రైవేట్‌ను డెయిరీలను ఆశ్రయించారు. ఫలితంగా ఏపీ డెయిరీ సంక్షోభంలో కూరుకుపోయింది.  

బాబు హయాంలో డెయిరీ పతనం 
చంద్రబాబు ప్రభుత్వం పాడిని రైతులను చిన్నచూపు చూసింది. ఇక అధికారుల అలసత్వం కారణంగా ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) నష్టాల బాట పట్టింది. డెయిరీనే నమ్ముకున్న వేలాది మంది రైతులు హెరిటేట్, గాయత్రి, తిరుమల, దొడ్ల లాంటి ప్రైవేట్‌ డెయిరీల వైపునకు మళ్లారు. దీంతో  డెయిరీకి పాలుపోసే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా పాలసేకరణ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో జిల్లాలోని 33 బీఎంసీలు, 56 పాలరూట్లు, 410 పాల సేకరణ కేంద్రాలు మూతబడ్డాయి.
 
నష్టాల బాటే కానీ...  
ఇప్పుడు జిల్లాలో 9 బీఎంసీలు, 18 రూట్లు, 130 పాల సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మడకశిర, గుడిబండ, అగళి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు మరో రెండు కేంద్రాలు అరకొరగా పనిచేస్తున్నాయి. రోజువారీగా 750 మంది రైతుల నుంచి 5 వేల లీటర్ల మేర పాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వహణ భారం పెరిగిపోయి.. నెలకు రూ.10 లక్షలకు పైగా నష్టం వస్తున్నట్లు డెయిరీ అధికారులు చెబుతున్నారు.  

జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తి  : 5 నుంచి 5.50 లక్షల లీటర్లు  
ప్రభుత్వ డెయిరీ పాల సామర్థ్యం  :  లక్ష లీటర్లు 
రోజూ ప్రభుత్వ డెయిరీకు వస్తున్న పాలు  : 5 వేల లీటర్లు 
ప్రైవేట్‌ డెయిరీలు సేకరిస్తున్న పాలు  : 1.90 లక్షల లీటర్లు 
చంద్రబాబు హయాంలో మూతబడిన కేంద్రాలు  : 33 బీఎంసీలు, 401 పాలకేంద్రాలు 
లీటర్‌పై రూ.4 బోనస్‌ ఇస్తే కలిగే లాభం  : రూ.50 కోట్లు (సంవత్సరానికి)   

చాలా సంతోషంగా ఉంది 
నేను అప్పులు చేసి మూడు పాడి ఆవులు కొన్నా. రోజూ 25 లీటర్ల పాలను ప్రభుత్వ డెయిరీకే పోస్తున్నా. గత ప్రభుత్వం పాలసేకరణ ధర తగ్గించడంతో నష్టపోయాను. పైగా చంద్రబాబు సర్కార్‌ పాడి రైతులకు బోనస్‌ కూడా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యాను. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పాడి రైతులకు అండగా నిలిచారు. లీటర్‌ పాలకు రూ. 4 బోనస్‌ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇటు పాడి రైతులతో పాటు పతనావస్థకు చేరిన ఏపీ డెయిరీకి మేలు జరుగుతుంది.  
– హనుమంతరెడ్డి, పాడి రైతు, గుడ్డంపల్లి,మడకశిర మండలం  

మరిన్ని వార్తలు