పాసులు సరే.. బస్సుల మాటేమిటి?

12 Jul, 2019 07:21 IST|Sakshi

సాక్షి, నరసన్నపేట : విద్యార్థులకు ఆర్థికభారం తగ్గించేందుకు రాయితీ బస్‌ పాసులను మంజూరు చేస్తున్న ఆర్టీసీ.. దీనికి తగిన విధంగా బస్‌ సర్వీసులు నడపడం లేదు. గతంలో ప్రవేశ పెట్టిన స్టూడెంట్‌ స్పెషల్‌ సర్వీసులను డిమాండ్‌కు అనుగుణంగా నడపక పోవడంతో రెగ్యులర్‌ బస్‌లు నిండుతున్నాయి.దీంతో విద్యార్థులు ఫుట్‌పాత్‌లపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుంది. మరోవైపు అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గంటల తరబడి కాంపెక్స్‌లో బస్‌ల కోసం చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు నరసన్నపేట కాంప్లెక్స్‌ వద్ద గురువారం ఆందోళనకు దిగారు.

బస్‌పాస్‌లకు తగినట్లుగా స్టూడెంట్స్‌ స్పెషల్‌ బస్‌లు నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఇలా అయితే తమ ఇళ్లకు ఎలా చేరుకోవాలని ప్రశ్నించారు. గత వారం రోజులుగా రోజూ కాంప్లెక్స్‌లో ఎస్‌ఎంకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో వారంతా బస్‌లు కదలకుండా ఆందోళనకు దిగారు. ప్రధానంగా బోరుబద్ర, పిన్నింటిపేట, పోలాకి, ప్రియాగ్రహారం రూట్లో అధికంగా సమస్య ఉందన్నారు. వయా పోలాకి రూట్‌లో ఉండాల్సిన బస్‌లు గత ప్రభుత్వం హయాంలో నిమ్మాడ మీదుగా మార్చారని తెలిపారు.

దీంతో అవసరం మేరకు రెగ్యులర్‌ బస్‌లు లేక, స్పెషల్‌ సర్వీసులు అరకొరగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు వివరించారు. స్టూడెంట్స్‌ స్పెషల్‌ బస్‌లు మరిన్ని నడపాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ ఎస్‌ఎం మూర్తి.. అక్కడకు చేరుకుని, విద్యార్థులతో మాట్లాడారు. 1, 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు