మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

9 Sep, 2019 14:49 IST|Sakshi

గ్రామ సచివాలయాల్లో హెల్ప్‌లైన్‌

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలు

సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు

సాక్షి, అమరావతి: మహిళా శిశుసంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో.. సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని  సీఎం స్పష్టం చేశారు. పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికే ఈ విధానాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడలే కానీ.. వాటి కారణంగా నిరాకరించకూడదని సీఎం ఆదేశించారు. 

గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయంలో అవసరాల కొరకు హెల్ప్‌లైన్‌  ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. గ్రామాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని సీఎం సూచించారు. దీని కొరకు  ప్రతి గ్రామ సెక్రటేరియట్‌లో ఒక హెల్ప్‌లైన్‌ ఉండాలన్నారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో.. వెంటనే నిధులను విడుదల చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇదే సమయంలో వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సీఎం నిర్ణయించారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ... కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారంరోజుల్లో మళ్లీ మంజూరు చేయాలన్నారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు.  టెస్ట్‌–ట్రీట్‌–టాక్‌ విధానంలో ఈ రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఎంకి వివరించారు. అలాగే పౌష్టికారంలో భాగంగా గర్భవతులకు ఏ విధమైన ఆహారంగా ఇస్తున్నారని సీఎం అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.22.5లు ఖర్చుచేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మరింత నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడంపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్షచేయాలని, దీని కొరకు అంగన్‌వాడీ వర్కర్లను మోటివేట్‌ చేయాలన్నారు. అలాగే బాల్య విహహాల నియంత్రనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  గ్రామాల్లో బాల్య వివాహాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలిని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఈ సందర్భంగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తనకు తెలియజేయాలన్నారు. భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని, వీటిని దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండదన్నారు. 

స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలు..
అంగన్‌ వాడీ భవనాల సెంటర్ల స్థితిగతులపై పూర్తినివేదిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహా కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. మూడేళ్లలో ఈపనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వం పాఠశాలలకు ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యాక్రమాలపై కార్పొరేటు, వివిధ ప్రైవేటు సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. అలాగే దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని, వారికి ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను వెంటనే గుర్తించి, వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు