ఈసారైనా ఆశలు చిగురించేనా?

11 Oct, 2018 08:08 IST|Sakshi

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిననోటిఫికేషన్లు 

ప్రకటనలతోనే సరిపెడుతున్నవిద్యాశాఖా మంత్రి

జిల్లాలో డీఎస్సీఖాళీలు 533  

తగ్గిన పోస్టులతో అభ్యర్థుల్లో ఆందోళన

రాయవరం (మండపేట): జిల్లాలో బీఎడ్, డీఎడ్‌ చేసిన అభ్యర్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. డీఎస్సీపై ఆశలతో చేస్తున్న ఉద్యోగాలను వదిలి, అప్పులు చేసి మరీ కోచింగ్‌ల బాట పట్టిన అభ్యర్థులు వేల సంఖ్యలో  జిల్లాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించగానే వేలాది మంది అప్పటికే చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాల్ని వదిలి, కుటుంబాలకు దూరమై కోచింగ్‌ సెంటర్ల వైపు పరుగులు తీశారు. ఉన్న ఉద్యోగాన్ని వదలడంతో జీతం నష్టపోవడమే కాకుండా, మరో పక్క కోచింగ్‌లకు వేలాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నష్టపోయారు. అయినా నేటికీ నోటిఫికేషన్‌ రాలేదని పలువురు అభ్యర్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.

నాలుగేళ్లుగా తప్పని ఎదురుచూపులు
ఏటేటా డీఎస్సీ నిర్వహిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో     పెట్టారు. తీరా నాలుగేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ మాత్రమే నిర్వహించారు. నాలుగేళ్లుగా డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారోనని శిక్షణ పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎదురుచూపులే మిగిలాయి. ఏటా జిల్లాలో బీఎడ్, డీఎడ్‌ శిక్షణ పొంది ఐదు వేల మంది వరకు బయటకు వస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన టెట్‌ పరీక్షలో సుమారు 48 వేల మంది హాజరయ్యారు. ప్రస్తుతం శిక్షణ పొందిన బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థులు దాదాపుగా 50 వేలకు పైబడి ఉంటారని అంచనా. శిక్షణ పొందిన వారంతా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

ఈ నెల పదో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామం టూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్‌ వాయిదా పడడంతో అసలు నోటిఫికేషన్‌ విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా నోటిఫికేషన్‌ వాయిదా పడే అవకాశాలున్నాయన్న వార్త హల్‌చల్‌ చేస్తుండడంతో నిరుద్యోగుల్లో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి. 

ఇప్పటికే రెండుసార్లు వాయిదా... 
డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. తొలుత ఈ ఏడాది మార్చిలో డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి తెలిపారు. నోటిఫికేషన్‌ తూచ్‌ అంటూ జనవరిలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించారు. టెట్‌ పేపరు–3 నిర్వహణా తీరు సరిగ్గా లేదంటూ లాంగ్వేజ్‌ పండిట్ల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో జూన్‌లో తిరిగి మరోసారి టెట్‌ నిర్వహించారు. ఆగస్టులో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తీరా చూస్తే ప్రకటన పక్కన పెట్టారు. ఇప్పుడు మూడోసారి చేసిన ప్రకటన కార్యరూపం దాలుస్తుందా..లేక మరోసారి నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ వాయిదా పడుతుందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. 

ఆది నుంచీ అయోమయమే...
ఖాళీల ప్రకటనలో ఆది నుంచి అభ్యర్థుల్లో అయోమయం నెలకుంటోంది. ప్రభుత్వం మొదట 19 వేల వరకు ఖాళీలున్నాయని ప్రకటించారు. తీరా నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికి జిల్లాలో తొలుత 1200 ఖాళీ పోస్టులున్నాయని భావించగా... చివరకు అవి 1,056 ఖాళీలుగా నిర్ధారించారు. ఇప్పుడు ఆర్థిక శాఖ అన్ని పోస్టులకూ అనుమతి ఇవ్వక పోవడంతో జిల్లాలో కేవలం 533 పోస్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లుగా సమాచారం.

పోస్టులపై డీఈవో పూల్‌ ప్రభావం...
జిల్లాలో ఉన్న ఖాళీ ఉపాధ్యాయ పోస్టులపై డీఈవో పూల్‌ ప్రభావం పడింది. జిల్లాలో పలు కారణాల వల్ల మిగులు ఉపాధ్యాయులను డీఈవో పూల్‌లో ఉంచారు. ఇలా జిల్లాలో 250 వరకూ మిగులు ఉపాధ్యాయులున్నారు. వీరిని ప్రస్తుతం ముంపు మండలాల్లో ఉన్న ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. డీఈవో పూల్‌లో ఉన్న టీచర్లను ప్రస్తుతం ఏర్పడే ఖాళీల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల డీఎస్సీ ఖాళీలపై ప్రభావం పడనున్నట్లు సమాచారం. 

జిల్లాలో ఖాళీల పోస్టుల పరిస్థితిదీ...
జిల్లాలో కేవలం 533 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా చూపుతున్నట్లు తెలిసింది. మైదాన ప్రాంతం, ఏజెన్సీలో ఎస్‌జీటీ 270, స్కూల్‌ అసిస్టెంట్లు 175, లాంగ్వేజ్‌ పండిట్లు 68 ఉన్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వక పోవడం, ఖాళీలను పూర్తి స్థాయిలో చూపకపోవడంతో ఉపాధ్యాయ పోస్టుల్లో భారీగా కోత పడుతున్నట్లు తెలుస్తోంది.

ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు...
జిల్లాలో గత ఫిబ్రవరిలో బీఎడ్, డీఎడ్‌ చేసిన వారు సుమారుగా 48 వేల మంది టెట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల డీఎడ్, బీఎడ్‌ కోర్సు పూర్తి చేసిన వారితో సుమారుగా 50 వేల పైబడి ఉపాధ్యాయ అభ్యర్థులున్నారు. తగ్గిన పోస్టులతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేలాది మంది జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం వంటి పట్టణాల్లోనే కాకుండా టెట్, డీఎస్సీ కోచింగ్‌కు పేరు పొందిన కృష్ణా జిల్లా అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ పొందుతున్నారు. తగ్గుతున్న పోస్టులతో తమ పరిస్థితి అగమ్యగోచరమేనంటూ వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోచింగ్‌కు రూ.50 వేలు వెచ్చించా
డీఎడ్‌ పూర్తి చేసి నాలుగేళ్లవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఏటా ఎదురు చూస్తున్నాను. గత ఏడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇస్తారని విద్యాశాఖా మంత్రి ప్రకటించడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కోచింగ్‌కు వెళ్లాను. ఆర్థిక స్థోమత సహకరించకున్నా రూ.50 వేలు ఖర్చు చేశాను.
– కె.సుప్రియ, డీఎడ్‌ విద్యార్థిని,
వి.సావరం, రాయవరం మండలం 

రెంటికీ చెడ్డ రేవడిగా...
పండిట్‌ ట్రైనింగ్‌ పొందాను. డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని చెప్పగానే ప్రైవేటుగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి లక్ష రూపాయలు వెచ్చించి కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాలుగు నెలలపాటు కోచింగ్‌ తీసుకున్నాను. నోటిఫికేషన్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో తిరిగి ఉద్యోగంలో చేరాను. 
– టిల్లపూడి రాధాకృష్ణకుమారి, తెలుగు పండిట్‌ అభ్యర్థిని, వెదురుపాక, రాయవరం మండలం

మరిన్ని వార్తలు