ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు..భారీ బాదుడొద్దు

22 Sep, 2019 04:46 IST|Sakshi

మధ్యస్త జరిమానాలకే రాష్ట్ర రవాణా అధికారుల కమిటీ మొగ్గు

సవరించిన వాటి కంటే తక్కువగానే విధించాలని సర్కారుకు సిఫారసు

సాక్షి, అమరావతి
ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేంద్రం నిర్ణయించినట్లుగా పదిరెట్ల జరిమానాలొద్దని.. మధ్యస్థంగానే విధించాలని ఏపీ రవాణా అధికారుల కమిటీ సిఫారసు చేసింది. అపరాథ రుసుంలపై ఈ కమిటీ రూపొందించిన సిఫారసుల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పదిరెట్ల వరకు జరిమానాలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ బిల్లు–2019ను గత పార్లమెంట్‌ సమావేశాల్లో సవరించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్‌–200 ప్రకారం సెప్టెంబరు నుంచి నూతన జరిమానాలు అమలుచేయాల్సి ఉంది. అయితే, ఈ చట్టం కింద జరిమానాలు అంత పెద్ద మొత్తంలో విధించే ముందు ప్రజలకు అవగాహన కల్పించి, మధ్యస్తంగా జరిమానాలు ఉండేలా ఏపీ రవాణా అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పలు రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద మొత్తంలో వాహనదారులపై జరిమానాలు విధించేందుకు ఆయా ప్రభుత్వాలు సుముఖంగా లేవు.

ఈ నేపథ్యంలో.. ఏపీలోనూ ట్రాఫిక్‌ జరిమానాలపై రవాణా శాఖ డిప్యూటీ రవాణా కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లతో అంతర్గతంగా ఓ కమిటీని నియమించుకుంది. ఈ కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు, కేంద్రం కొత్తగా విధించాలన్న జరిమానాలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించింది. పదిరెట్ల జరిమానాలు రాష్ట్రంలో విధించవద్దని, కేంద్రం నిర్దేశించినట్లుగా కాకుండా మధ్యస్తంగా జరిమానాలు విధించాలని కమిటీ అభిప్రాయపడి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపింది. అలాగే, ముందుగా వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, అప్పటివరకు ఓ మోస్తరు జరిమానాలతో సరిపుచ్చాలని అందులో సూచించారు. ప్రభుత్వ నుంచి ఆమోదం వస్తే కేంద్రం నిర్దేశించిన దానికంటే తక్కువగానే జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సన్నద్ధమవుతోంది.

లైసెన్సులు లేనివారే ఎక్కువ
కాగా, రాష్ట్రంలో అన్ని కేటగిరీల వాహనాలు మొత్తం 90 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో అధిక శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పటివరకు రూ.500 జరిమానా విధిస్తున్నారు. మోటారు వాహన సవరణ బిల్లులో రూ.5 వేల జరిమానా విధించేలా పొందుపరిచారు. అయితే, రాష్ట్రంలో లైసెన్సు లేకుండా వాహనం నడిపితే జరిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి మధ్యస్తంగా జరిమానాలు విధించనున్నారు.

మరిన్ని వార్తలు