జర్నలిస్టుల వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటుకు కృషి

27 Jan, 2020 08:29 IST|Sakshi

కూనవరం: జర్నలిస్టులకు వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరిలోని సుందర సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వెళ్తూ.. కూనవరం ప్రెస్‌క్లబ్‌లో  ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. 

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి వివిధ పత్రికల్లో పని చేస్తున్నప్పటికీ గిరిజన చట్టాల మూలంగా తమకు ఇంటి స్థలాలు మంజూరు కావడం లేదని ఏజెన్సీ ప్రాంత విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కూనవరం పాత్రికేయులు శ్రీనాథ్‌ను సత్కరించారు.

మరిన్ని వార్తలు