ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్‌ బిశ్వభూషణ్‌

17 Nov, 2019 14:46 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా : ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లమని, కానీ వాణిజ్య కారణాల వల్ల రైతులు ఎరువుల ఉపయోగం వైపు మళ్లారని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతులు, స్వయం సహాయక బృంద మహిళలతో గవర్నర్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రసాయనాల వల్ల భూసారం తగ్గిపోయి కొన్నాళ్లకు భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. పంట మొత్తం విషపూరితమవుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి పద్దతులు సమాజానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోమని కోరతానని తెలిపారు.

కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. జిల్లాలో రోజురోజుకీ ప్రకృతి వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆవులు కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్ధిక సహాయం అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో 18 వేల మంది ప్రకృతి రైతులున్నారని, ఇటీవల ఢిల్లీలో ఈ విభాగంలో పురస్కారం కూడా అందుకున్నామని తెలిపారు. గవర్నర్‌ స్వయంగా ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు