ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..?

8 Nov, 2023 14:04 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.  ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో కాలుష్యం తీవ్రతరమౌతోందని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలని ఆదేశించింది. ఇదే క్రమంలో ఆనంద్ మహీంద్రా రీజనరేటివ్ అగ్రికల్చర్‌(పునరుత్పత్తి వ్యవసాయం) సరైన ప్రత్యామ్నాయ మార్గమని ఎక్స్‌లో షేర్ చేశారు. ఇంతకీ ఈ పునరుత్పత్తి వ్యవసాయం అంటే ఏంటీ..?

పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా ప్రకృతికి అనుగుణంగా నేలసారాన్ని పెంచుతూ సాగు చేసే విధానం. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తారు. పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ విధానాలను అనుసరిస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. 

ఇదీ చదవండి: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌తో ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం

ఇందులో అనుసరించే కొన్ని పద్ధతులు..

  • నేల సహజ నిర్మాణాన్ని భంగపరచకుండా సాగు చేస్తారు. ఇందుకు నేలను భారీ యంత్రాలతో కాకుండా పశువులతో దున్నుతారు. అతిగా దున్నడం వల్ల నేల నుంచి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్‌ ఎక్కువ విడుదల అవుతుంది.
  • పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. ఓకేసారి వివిధ రకాల పంటలను వేస్తారు. దీని వల్ల పోషకాలతో నేల సారవంతమౌతుంది. కలుపు మొక్కలను నిరోధిస్తుంది. 
  • కంపోస్టు ఎరువును వినియోగిస్తారు. నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని ఈ విధానం పెంచుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు అంతం అవుతాయి.
  • పశువుల ఎరువును మాత్రమే పంటలకు ఉపయోగిస్తారు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా నేల సారాన్ని పెంచుతాయి. తెగుళ్లను కూడా నియంత్రిస్తాయి. 
  • వ్యవసాయంలో ఉత్పాదకతతో పాటు పోషక విలువల్ని పెంచే పంటలను ఎంచుకోవాలి. 
  • పునరుత్పత్తి వ్యవసాయం పర్యావరణానికి మాత్రమే కాదు, రైతులకు, వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రైతుల ఆదాయాన్ని, అలాగే ఆహార నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 

ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం

మరిన్ని వార్తలు