జీఎన్‌ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్‌ కమిటీ

30 Dec, 2019 05:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్‌ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, అవసరమైతే అడ్వొకేట్‌ జనరల్‌ సూచనలు తీసుకోవాలని హైపవర్‌ కమిటీకి దిశానిర్దేశం చేస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని సెప్టెంబరు 13న ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పలు సిఫార్సులు చేసింది. అవి ఏమిటంటే..

►మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లో ఉన్నట్లు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన (లెజిస్లేచర్‌) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో, శీతాకాల సమావేశంలో అమరావతిలో నిర్వహించాలి. విశాఖలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయాలి. అమరావతిలో హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఉండాలి.
►అలాగే, అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాలను ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తయిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి.
►అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాలు ఉండరాదు.
►సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానించాలి.
►శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఈ సిఫార్సుల నేపథ్యంలో.. త్వరలో రానున్న బీసీజీ నివేదికతోపాటు జీఎన్‌ రావు సూచనలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేయాలని ఈనెల 27న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కమిటీ సభ్యులు
బుగ్గన, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ సవాంగ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు, న్యాయ శాఖ కార్యదర్శులు

మరిన్ని వార్తలు