నేటి నుంచే గ్రామ స్వరాజ్య పాలన

2 Oct, 2019 08:10 IST|Sakshi
సిద్ధమైన గార మండలంలోని అంపోలు గ్రామ సచివాలయం

పల్లె నవ్వింది.. మహాత్ముడి ఆశయం నెరవేరుతోందని. ఊరు ఊపిరి తీసుకుంది.  ఇక పట్టణంపై గ్రామం ఆధారపడనక్కర్లేదని. జాతిపిత 150వ జయంతి నాడు దేశం కొత్త సందేశం అందుకుంది.. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాణం పోసుకుందని. సిక్కోలు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. గ్రామ పాలనకు శ్రీకారం చుడుతూ బుధవారం జిల్లావ్యాప్తంగా 835 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక పనులు  ఆలస్యమవుతాయని బాధ ఉండదు. పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ ఉండదు. 

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : మహాత్మా గాం«ధీ కలలు గన్న స్వరాజ్య పాలన మన ముందుకు వచ్చేసింది. ఆ మహాత్ము డి ఆశయాల్లో కీలకమైన వ్యవస్థకు నేడు ఆయన జయంతి రోజునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రెండు వేల మం ది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ సరికొత్త చరిత్రకు సీఎం పునాది రాయి వేశారు. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మండలానికి ఒక్కొక్కటి చొప్పున 38 సచివాలయాలను నేడు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు.  

జిల్లాలో సచివాలయాల పరిస్థితి ఇది.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే గ్రామీణాభివృద్ధి–పాలనపై దృష్టి సారించారు. గ్రామీణ ప్రజానీకం పాలకుల మోసాలకు గురవుతున్నారని గుర్తించి గ్రామ సచివాలయ వ్యవస్థను అమలు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 1141 పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన 835 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో ముందుగా మండలానికి ఒకటి చొప్పున 38 సచివాలయాలను నేడు ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో 10 టేబుళ్లు, 30 కు ర్చీలు, 06 ఫైల్‌ రాక్స్, ఒక గ్రామ సచివాలయ బోర్డు, ఒక ఐరన్‌ సేఫ్‌ (బీరువా)తో పాటు ఆరు నెలల పాటు సచివాలయానికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి సుమారు రూ.1.79 లక్షల వరకు నిధులను రాష్ట్ర ప్రభు త్వం కేటాయించింది. నిబంధనల ప్రకారం టెండర్‌ ప్రక్రియ ద్వారా వస్తువుల కొనుగోలు తదితర ఏర్పాట్లతో నవంబర్‌ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలతో సచివాలయాలన్నీ సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. 

72 గంటల్లోనే వినతుల పరిష్కారం 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయి ప్రభుత్వ పథకాలు అందాలనే ధ్యేయంతో నేరుగా వారి ఇంటి ముంగిటకే పథకాల ఫలాలు అందాలనే పారదర్శక నిర్ణయంతో ముఖ్యమంత్రి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముందు గా గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తూ వారి ద్వారానే ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ కావాల్సిన ప్రభుత్వ సాయాన్ని తెలుసుకుని, ఆ వివరాలతో నేరుగా గ్రామ సచివాలయానికి తీసుకువెళ్లి, దరఖాస్తు చేయించి, కేవలం 72 గంటల్లోనే పరిష్కారం అయ్యేలా ఈ సచివాలయాలు పనిచేయనున్నాయి. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పలు విభాగాల అధికారులు త్వరలోనే విధుల్లోకి చేరనున్నారు. ఈ కొత్త అధికారులకు శిక్షణ పూర్తి కాగానే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ పనిచేసేలా రూపకల్పన చేశారు.  జిల్లాలో మొత్తం 835 సచివాలయాల్లో 719 సచివాలయాలను స్థానికంగా ఉన్న పంచాయతీ భవనాలనే అందమైన నీలం, ఆకుపచ్చ రంగులతో ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆయా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ భవనా ల్లో మరో 75 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే అద్దె భవనాల్లో 16 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. కాగా 25 సచివాలయాలకు పూర్తిగా భవనాల కొరత కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  

నేడు 38 గ్రామ సచివాలయాల ప్రారంభం 
జిల్లాలో మండలానికొక మోడల్‌ సచివాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 38 పంచాయతీ కేంద్రాల్లోనే సచివాలయాల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా