మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం

22 Feb, 2020 20:25 IST|Sakshi

హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ దాడులకు పాల్పడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలకు చేస్తోందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తూనే ఉందని పేర్కొన్నారు.

‘రాజధాని భూములు, ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్, గనుల్లో అక్రమ తవ్వకాలు తాజాగా ఈఎస్‌ఐ స్కాం. ఈ అవినీతి బాగోతాలు బయటకు వస్తున్న తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు విష ప్రచారం చేస్తున్నాయని’ మంత్రి సుచరిత ధ్వజమెత్తారు. కేవలం టీడీపీ ఉనికిని కాపాడడానికే ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేవలం వికేంద్రీకరణ వల్లనే రాజధానిలో గుండెపోటుతో మృతిచెందారని, మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ‍హోంమంత్రి మండిపడ్డారు. (మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం)

ఎల్లో మీడియా విషం చిమ్ముతుంది..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు, మహిళల అభ్యున్నతి కోసం నిలబడిన ప్రభుత్వమని సుచరిత పేర్కొన్నారు. ప్రభుత్వం, మంచి ఆలోచనలతో పనిచేస్తోన్న పోలీసు యంత్రాంగంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతుందని విమర్శించారు. రాజధాని ఉద్యమం ముసుగులో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. మహిళల మానాలకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. స్త్రీ జాతికే అవమానం కలిగించేలా వారి తీరు ఉందని ఆమె దుయ్యబట్టారు.

నీచ రాజకీయాలు సహించం..
మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తోన్న నీచ రాజకీయాలకు ఎల్లో మీడియా సహకరిస్తూ.. దిక్కుమాలిన రాతలు రాస్తున్నాయని మంత్రి సుచరిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవాస్తవాలు రాస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఆందోళనల ముసుగులో టీడీపీ నేతలు ప్రజలను, ఉద్యోగులను ఇబ్బందులకు  గురిచేస్తున్నారు. పోలీసులు చట్టం ప్రకారం ముందుకు వెళ్తే.. మహిళలను అడ్డం పెట్టుకుని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పోలీసులపైనే తప్పడు ఆరోపణలు చేస్తున్నారు. డ్రోన్‌ ఆపరేటర్‌ పై దాడిచేసి డ్రోన్‌ ఎత్తుకుపోయారు. ఏపీలో ప్రతి ఇంటికీ బాత్‌రూం కట్టించానని చంద్రబాబు చెప్తాడు. మరో వైపు మహిళలను చిత్రీకరిస్తున్నారని అదే చంద్రబాబు మనుషులు ఆరోపణలు చేస్తారు’ అంటూ మంత్రి విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే వారి జోలికెళ్లమని.. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని.. మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి సుచరిత హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు