ఆ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా?: సజ్జల

15 Dec, 2023 13:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మార్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు.

‘‘వైసీపీ ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?. ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు. చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.


‘‘తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు. ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా?. ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా?. తుపాను పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి. హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు. 2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు. హైదరాబాద్‌లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.

‘‘చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి. గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా. అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు. బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు. చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు?. 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు. చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు. సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక బోగస్ ఫోరమ్‌ను పెట్టారు’’ అని సజ్జల మండిపడ్డారు.

‘‘వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు. చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా? నిమ్మగడ్డ రమేష్‌కు తెలియదా?. సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్‌ను దించుతుంది. మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం.. బలంగా ఉన్నాం. ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు. చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది. సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం. చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి’’ అని సజ్జల పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్‌ సూటి ప్రశ్న.. సమాధానముందా? 

>
మరిన్ని వార్తలు