ఏపీ ఐసెట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు

14 May, 2015 03:41 IST|Sakshi

ఏఎన్‌యూ:  ఏపీ ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)-2015కు గుంటూరు రీజియన్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఐసెట్ గుంటూరు రీజియన్ కోఆర్డినేటర్, ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల కామర్స్ విభాగాధిపతి  డాక్టర్ ఆర్.శివరాం ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఐసెట్ వివరాలను వెల్లడించారు. ఐసెట్ ఈనెల 16వ తేదీన జరుగుతుందన్నారు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులను 9:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు.

గుంటూరు రీజియన్‌లో 16 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు అన్ని కేంద్రాల నుంచి 8,650 మంది హాజరవుతున్నారన్నారు. ప్రతి కేంద్రానికి పరిశీలకులను నియమించామని చెప్పారు. ఇతర యూనివర్సిటీల నుంచి మరో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను ఐసెట్ కన్వీనర్ పంపనున్నారని తెలిపారు. పరీక్ష ఏర్పాట్ల కోసం గుంటూరు కలెక్టరేట్ నుంచి 3 రూట్లు ఏర్పాటు చేశామన్నారు.

పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్‌లు అనుమతించడం లేదని, విద్యార్థులెవరూ వాటిని వెంట తెచ్చుకోవద్దని సూచించారు.  హాల్‌టికెట్‌లలో సమస్యలు ఉన్న విద్యార్థులు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంటతెచ్చుకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. సందేహాలు ఉన్న విద్యార్థులు 9849856589 సెల్ నంబరును సంప్రదించాలన్నారు.
 
పరీక్షా కేంద్రాల వివరాలు..
గుంటూరు రీజియన్‌లో జీవీఆర్ అండ్ ఎస్ మహిళా కళాశాల, క్రీస్తు జయంతి కాలేజ్ , జేసీ కాలేజ్ ఆఫ్ లా , ఆర్‌వీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జేకేసీ డిగ్రీ కాలేజ్, విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ (పెదపలకలూరు రోడ్), బీహెచ్‌హెచ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఏసీ కాలేజ్, ఆంధ్రా లూథరన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అభ్యుదయ మహిళా కళాశాల,  టీజేపీఎస్ కాలేజ్, మహాత్మాగాంధీ కాలేజ్, హిందూ కాలేజ్, సెంయింట్ ఆన్స్ కాలేజ్ (గోరంట్ల), చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ  (లాం) కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని రీజినల్ కోఆర్డినేటర్ శివరాం ప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు