-

50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్

26 Mar, 2016 20:34 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహాలకు వినియోగించే విద్యుత్‌ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు. ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానూ.. ఆ పైన వినియోగించే విద్యుత్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని కిషోర్ బాబు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్‌ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా వారు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించే అంశంపై సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తారని రావెల చెప్పారు.

మరిన్ని వార్తలు