-

ఏపీ పెవిలియన్‌కు విశేష ఆదరణ 

27 Nov, 2023 04:54 IST|Sakshi
సందర్శకులతో కిటకిటలాడుతున్న ఏపీ పెవిలియన్‌  

ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో రాష్ట్ర విశిష్టతను తెలియజేసేలా ఏపీ పెవిలియన్‌ 

జీఐ ఉత్పత్తులతో పాటు హస్తకళా ఉత్పత్తులకు డిమాండ్‌ 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నాడు–నేడుపై సందర్శకుల ఆసక్తి 

అడ్వాంటేజ్‌ ఏపీ పేరుతో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ కియోస్క్‌ 

సంప్రదాయ కళలను పరిచయం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు 

రోజుకు లక్ష మందికిపైగా ఏపీ పెవిలియన్‌ సందర్శన 

అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ 

సాక్షి, అమరావతి: ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌–2023లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌కు సంద­ర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. న్యూఢిల్లీ­లోని ప్రగతి మైదాన్‌లో ‘వసుధైక కుటుంబం–యునైటెడ్‌ బై ఇండియా’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 14న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ నవంబర్‌ 27వ తేదీతో ముగియనుంది.

రాష్ట్రం నుంచి 195 దేశాలకు 3,137 ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో కుటుంబ సభ్యులుగా మా­రి వసుధైక కుటుంబంగా ఎలా ఎదిగిందన్న విష­యాన్ని తెలియచేసే విధంగా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దా­రు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు­త్వం ఈ­సారి ఎగ్జిబిషన్‌లో 550 చదరపు మీ­టర్ల విస్తీర్ణంలో సందర్శకులను కట్టిపడేసే విధంగా ఏపీ పెవిలియన్‌ తీర్చిదిద్దింది. రాష్ట్ర పరిశ్రమల శా­ఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు.  

 భారీగా సందర్శకుల తాకిడి 
రాష్ట్రంలోని హస్తకళలు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో పాటు హస్తకళా ఉత్పత్తులతో ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉందని, ప్రతిరోజు లక్ష మందికిపైగా సందర్శకులు పెవిలియన్‌ను సందర్శిస్తున్నారని పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (ఎగుమతులు) జీఎస్‌ రావు ‘సాక్షి’కి చెప్పారు.

క­లంకారీ, మంగళగిరి జరీ, ధర్మవరం పట్టు, నె­ల్లూరు ఉడెన్‌ కట్లరీ, లేపాక్షి, తోలు బొమ్మలు వంటి వాటికి సందర్శకుల నుంచి మంచి స్పందన వ­చ్చిదని, పలువురు భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు ఇ­చ్చారని వివరించారు. నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో నాడు–నేడు కింద అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో వివరిస్తూ ఆర్ట్‌ రూపంలో ఏర్పాటు చేసిన చిత్రానికి మంచి స్పందన వచ్చిదని, పలువురు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారని చెప్పారు. 

అధికారులకు అభినందన 
పెవిలియన్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వైఎస్సార్‌ ఏపీ వన్‌ కింద ఏవిధంగా త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నారో తెలియజేసే కియోస్‌్కని పలువురు సందర్శించారు. 974 కి.మీ. తీర ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నదీ, మత్స్య ఎగుమతుల్లో ఏపీ నంబర్‌–1 స్థానంలో ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ వద్ద పలువురు ఫొ­టో­లు దిగుతున్నారు.

సాయంత్రం వేళ రాష్ట్రంలో­ని సంప్రదాయ కళలను పరిచయం చేసేవిధంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా పెవిలియన్‌ను తీర్చిదిద్దారంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ అధి­కారులను ప్రశంసించారు. కాగా.. సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఏపీ పెవిలియన్‌కి ఐఐటీఎఫ్‌ జ్యూరీ అవార్డు ప్రకటించింది.

మరిన్ని వార్తలు