Sakshi News home page

మూడు నగరాల్లో సిటీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు 

Published Mon, Nov 27 2023 5:14 AM

Diagnostic Center constructed at Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వ రంగంలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడానికి తొలినుంచి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రజారోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాల విస్తరణపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామస్థాయిలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ మొదలు బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది.

ఈ క్రమంలో ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో ‘సిటీ డయాగ్నోస్టిక్‌’ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మూడుచోట్లా రూ.20 కోట్ల చొప్పున నిధులతో డయాగ్నోస్టిక్‌ సెంటర్లతో పాటు, రీజినల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఇక విశాఖ, తిరుపతిల్లో డిసెంబర్‌ నెలాఖరులోగా సివిల్‌ పనులన్నీ పూర్తిచేసేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది.  

సేవలన్నీ ఒకేచోట.. 
పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, రేడియాలజీ వంటి వ్యాధి నిర్ధారణ, పరిశోధన సేవలు, పరీక్షలన్నీ ఒకేచోట లభించేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. 100 నుంచి 10 వేల ల్యాబ్‌ టెస్ట్‌లను నిర్వహించేలా బల్క్‌టెస్ట్‌ ఆటోమిషన్‌ పరికరాలను ఈ కేంద్రాలకు ప్రతిపాదించారు. అలాగే, డిజిటల్‌ ఎక్స్‌రే ప్లాంట్స్, 360 డిగ్రీల డెంటల్, డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్స్, 1.5 టెస్లా ఎమ్మారై, కలర్‌ డాప్లర్, మల్టీచానెల్‌ ఈసీజీ, పాథాలజీ హెమటాలజీ ఎనలైజర్‌ సహా పలు రకాల అధునాతన రోగ నిర్ధారణ పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. అనుభవజు్ఞలైన వైద్యులు, సుశిక్షితులైన పారామెడికల్‌ సిబ్బందితో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. 

రిఫరల్‌ ల్యాబ్స్‌గా అభివృద్ధి.. 
పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా, బోధనాస్పత్రుల్లో అందుబాటులో లేని నిర్ధారణ పరీక్షలు ఈ సిటీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో వీటిని రిఫరల్‌ ల్యాబ్స్‌గా కూడా అభివృద్ధి చేయనున్నారు. అదే విధంగా.. కిందిస్థాయి ఆస్పత్రులకు హబ్‌ స్పోక్‌ విధానంలో ఇక్కడి సేవలను అందించేలా డిజిటల్‌ వసతుల కల్పన ఉండనుంది. 

Advertisement

What’s your opinion

Advertisement