‘బాబుకు సొంత ఎమ్మెల్యేల మద్దతే లేదు’

16 Nov, 2019 14:25 IST|Sakshi
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇసుక దీక్షకు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరగకుండా టీడీపీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానిలో భాగంగానే పలువురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్‌లో అన్యమత ప్రచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో సోలార్‌ ప్యాన్‌లను శిలువగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. హిందూ దేవాలయాల అభివృద్ధి కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 234 కోట్లు కేటాయించాం’ అని అన్నారు.

గత ఎన్నికల్లో  దారుణంగా ఓటమిపాలైనా.. టీడీపీ నేతలకు బుద్ధి రావడంలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ‘సీఎం వైఎస్‌ జగన్‌పై కుట్రతోనే చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నంలో తాముంటే.. ఇలా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. గడిచిన ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. చంద్రబాబు హయాంలోనే విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారు. రాజమండ్రి పుష్కరాల్లో బాబు ప్రచారం కోసం భక్తుల ప్రాణాలు తీశారు. అర్చకుల మేలు కోసం చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాన్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. అని విమర్శించారు.

మరిన్ని వార్తలు