అధికారులతో చెడుగుడు!

26 May, 2015 11:57 IST|Sakshi
అధికారులతో చెడుగుడు!

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు తమదైన 'శైలి'లో చెలరేగుతున్నారు. ఏపీ అధికారులతో చెడుగుడు ఆడుతున్నారు. తమ మాట చెల్లించుకునేందుకు 'పవర్' చూపిస్తున్నారు. 'పచ్చ' బాబులకు అనుకూలంగా పనిచేయని అధికారులకు బదిలీ వేటు తప్పదని  హెచ్చరించారు. మినీ మహానాడు వేదికగా సాక్షాత్తూ టీడీపీ మంత్రులే ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వడం శోచనీయం. అసలు తమ కార్యకర్తలకు పనులు చేసే పెట్టేందుకే అధికారులు ఉన్నారట్టుగా అమాత్యులు మాట్లాడుతుండడం విస్తుగొల్పుతోంది.

అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా గడుసుగా ప్రశ్నించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు తమ్ముళ్లు ఎంతో కష్టపడ్డారని, వారి కోసం పనులు చేస్తే తప్పా అని రెట్టించారు. ఆమాటకొస్తే  ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదని అసలు నిజం బయపెట్టారు. తాను ఇలా అన్నానని మీడియా గగ్గోలు పట్టినా పట్టించుకోనని, తన పని తనదేనంటూ విశాఖలో నిర్వహించిన మినీ మహానాడులో అయ్యన్న అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం మినీ మహానాడులో హుకుం జారీ చేశారు. ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని సెలవిచ్చారు. తెలుగు తమ్ముళ్లకు 'రెస్పెక్ట్' ఇవ్వకపోతే రప్ఫాడిస్తామని అధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని కడప మినీ మహానాడులో హెచ్చరించారు.

అధికార పార్టీ కార్యకర్తల మనసు గాయపడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితబోధ చేశారు. తెలుగు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేస్తే క్షమించనని చెప్పారు. అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం జరిగినా.. వేధించినా రాజీపడే ప్రసక్తి లేదని నెల్లూరు టీడీపీ మినీ మహానాడులో ముక్తాయించారు.  మంత్రులు, టీడీపీ నాయకుల వార్నింగులతో అధికారులు బెంబేలెత్తున్నారు.

కర్నూలు మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఒక అడుగు ముందుకేసి పోలీసుల సేవలను తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు వాడుకోవాలన్న సూచన చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయిలో సహకరించాలని కూడా ఆయన మనవి చేశారు. డిప్యూటీ సీఎం మాటలకు తగ్గట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు తాళం వేశారు. మాట వినని అధికారుల లిస్ట్ ఇస్తే తానే స్వయంగా సంతకం పెట్టి సీఎం దగ్గరకు పంపుతానంటూ 'పుషింగ్' ఇచ్చారు. మంత్రులే బెదిరింపులకు దిగడంతో అధికారులు హడలిపోతున్నారు.

మరిన్ని వార్తలు