భూగర్భ జలాల అధ్యయనం; ప్రభుత్వం కీలక ఆదేశాలు

31 Aug, 2019 10:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది. యురేనియం కార్పొరేషన్‌ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా.. లేదా అన్న విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఇక నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్‌జీఆర్‌ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు,  ఏపీ మైన్స్‌ మరియు జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను నియమించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ విషయంపై సత్వరమే నివేదిక అందించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడురోజుల్లోగా నియామకాలు పూర్తిచేసి...10 రోజుల్లోగా కమిటీ నివేదిక అందించనుంది.

కాగా యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రమాణాలను పాటించడంలేదని, టెయిల్‌ పాండ్‌ నిర్మాణంలో సరైన డిజైన్, ప్రణాళిక లేదంటూ జూన్‌ 21,2018లో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రిటైర్డ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ కె.బాబురావు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన బోర్డు సదరు సంస్థకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అయితే యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ బోర్డు మార్గదర్శకాలను పట్టించుకోకపోగా.. తాము ఇదివరకు తీసుకున్న చర్యలు సరిపోతాయని తెలిపింది. దీంతో ఆగస్టు 7న బోర్డు షోకాజ్‌ నోటీసు జారీచేసింది. తాజాగా ఈ విషయమై ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు