స్తంభం ఎక్కేద్దాం... కొలువు కొట్టేద్దాం..

4 Sep, 2019 12:33 IST|Sakshi
సామర్థ్య పరీక్షలో భాగంగా స్తంభం ఎక్కుతున్న అభ్యర్థి

నిఘా నీడలో జేఎల్‌ఎంల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

మొదటి రోజు 224 మంది హాజరు

92 మంది అభ్యర్థుల గైర్హాజరు

స్తంభం ఎక్కడంలో సామర్థాలను పరీక్షిస్తున్న అధికారులు 

జారిపడిన ఓ అభ్యర్థి..  నడుముకు గాయం 

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొలువుల జాతర కొనసాగుతోంది. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో విద్యుత్‌ శాఖ తరఫున సేవలందించే జూనియర్‌ లైన్‌మెన్‌ల నియామక ప్రక్రియ నిఘా నీడలో మంగళవా రం ప్రారంభమైంది. విజయనగరం దాసన్నపేట విద్యుత్‌ భవనం ప్రాంగణంలో ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ వై.విష్ణు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎంపికల్లో మొదటి రోజు 92 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 528 పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న ఎంపికలకు 1575 మందికి విద్యుత్‌ శాఖ అధికారులు కాల్‌ లెటర్‌లు పంపించారు.

ఇందులో మొదటి రోజు 316 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా... 224 మంది మాత్ర మే హాజరయ్యారు. ఎంపికలకు వచ్చిన అభ్యర్థులకు  ముందుగా పది, ఐటీఐ, ఇతర అర్హత ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అనంతరం 8 మీటర్ల విద్యుత్‌ స్తంభం ఎక్కడం, మీటర్‌ రీడిం గ్, సైక్లింగ్‌ అంశాల్లో అభ్యర్థి వ్యక్తిగతల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. 5 బ్యాచ్‌లుగా నిర్వహించిన ఎంపికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందో బస్తు నియమించారు. ఈ ఎంపికల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనలో వెనుదిరగగా.. మరికొందరు స్తంభం ఎక్కడంలో విఫలమయ్యారు. పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలన్న సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయగా... విశాఖ కార్పొరేట్‌ కార్యాలయానికి చెందిన ఏపీఈపీడీసీఎల్‌ సీజీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎం విజయకుమారిలు దగ్గరుండి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి...
విద్యుత్‌ భవనం ఆవరణలో నిర్వహించిన జూనియర్‌లైన్‌మన్‌ ఎంపికల కోసం విద్యుత్‌ శాఖ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎంపికల్లో కీలకమైన స్తంభం ఎక్కడంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుస్తు భధ్రతాచర్యలు చేపట్టారు. స్తంభం దిగువ భాగంలో రెండు అడుగుల ఎత్తులో ఇసుక, రంపం పొట్టు వేయడంతో పాటు అభ్యర్థి జారి పడిపోతే పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేశారు. అభ్యర్థి స్తంభం మధ్యలోనే ఉండిపోతే కిందకు దించేందుకు నిచ్చెనెలు సిద్ధం చేశారు. ఈప్రక్రియను ఐదుగురు డివిజన్‌స్థాయి ఇంజినీరింగ్‌ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే, చాలా మంది అభ్యర్థులు ఉద్యోగం ఆశతో తమకు అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి పాట్లు పడ్డారు. టెస్ట్‌ కోసం పోల్‌ ఎక్కిన దుర్గా ప్రసాద్‌ అనే అభ్యర్థి కాలు జారీ పోల్‌ మీద నుంచి కింద పడిపోయాడు. సుమారు 8 మీటర్ల ఉండే పోల్‌ ను అభ్యర్థులు ఎక్కాల్సి ఉంటుంది. అదే క్రమంలో పోల్‌ ఎక్కుతున్న నెల్లిమర్ల జరజాపుపేటకు చెందిన దుర్గా ప్రసాద్‌ 6 మీటర్ల ఎత్తులో వెళ్లేసరికి ఒక్కసారిగా చేతులు జారీ కింద పడిపోయాడు. నడుముకి గాయమైంది. వెంటనే స్పందించిన విద్యుత్‌ శాఖ  అధికారులు అభ్యర్థిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. 

స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి.. 
ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో 528 జేఎల్‌ఎం పోస్టుల నియామకాలకు  సంబంధించి నిర్వహిస్తోన్న ఎంపికల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి. సామర్థ్యం లేనివారు ఎంపికలకు హాజరుకాకపోవడం మంచిది. కోరుండి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఐదురోజుల పాటు జరిగే ఎంపికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. వీడియో చిత్రీకరణ జరుగుతుంది. కార్పొరేట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు ఎంపికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం నుంచి ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది.  
– యాగంటి విష్ణు, ఎస్‌ఈ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా