Sakshi News home page

TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్‌ స్కాం!

Published Mon, Oct 16 2023 12:53 PM

Jobs For Bribes TCS Scam - Sakshi

దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్‌లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్‌ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.  

మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్‌ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది.

కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్‌ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది.

ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు  రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్‌ఆర్‌ అండ్‌ టాలెంట్‌ అక్విజేషన్‌, రిసోర్స్‌ అలోకేషన్‌ గ్రూప్‌ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్‌ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్‌ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్‌ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి  తీసుకుంటుందని చెప్పింది.

Advertisement

What’s your opinion

Advertisement