ఆర్టీసీకి 698 కొత్త బస్సులు!

9 Feb, 2020 10:15 IST|Sakshi

18 వోల్వో, 50 ఇంద్ర, 630 నాన్‌ ఏసీ బస్సుల కొనుగోలుకు నిర్ణయం.. 

రూ.వెయ్యి కోట్ల రుణం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: ప్రయాణికుల ఆదరణను మరింతగా పెంచుకునేందుకు ఆర్టీసీ కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెలలోనే 698 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీటిలో 18 మల్టీ యాక్సిల్‌ వోల్వో, 50 ఇంద్ర, 630 నాన్‌ ఏసీ బస్సులు కొనాలని ప్రతిపాదించారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులను దశల వారీగా మార్చడంతో పాటు అధ్వానంగా ఉన్న బస్సులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. అధ్వానంగా ఉన్న బస్‌ల బాడీ యూనిట్లు మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి డిపోల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. సౌకర్యాలను మరింత మెరుగుపర్చటం ద్వారా ఆక్యుపెన్సీ శాతాన్ని 90కు పైగా పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. 

కొత్త బస్సులకు రూ.225 కోట్లు 
విలీనానికి ముందే ఆర్టీసీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. బడెŠజ్‌ట్‌లో రూ.1,572 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత రూ.వెయ్యి కోట్లను గ్యారంటీ రుణం కింద అందించింది. ఈ నిధుల్లో రూ.225 కోట్లను కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ కేటాయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 27 వెన్నెల స్లీపర్, 68 అమరావతి బస్సులు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. వీటికంటే అధునాతనంగా ఉండే 18 మల్టీ యాక్సిల్‌ వోల్వో బస్సులను సమకూర్చుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఏసీ సర్వీసులైన గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, అర్బన్‌లో నడిచే బస్సులు మొత్తం కలిపి 230 వరకు ఉన్నాయి. ఏసీ సర్వీసుల్లో ఆక్యుపెన్సీ శాతం 90 వరకు ఉంటోంది.  

పాఠశాల బస్సుల్ని సిటీ సర్వీసులుగా తిప్పే యోచన 
ప్రైవేట్‌పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల్ని ప్రధాన నగరాల్లో సిటీ సర్వీసులుగా తిప్పి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. తొలుత విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రైవేటు బస్సులు ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉంటాయి. ఆ బస్సులకు ఇంధనం సమకూర్చి ఖాళీ సమయాల్లో వాడుకునేందుకు విద్యాసంస్ధల యాజమాన్యాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు