ఆక్వా రైతు కుదేలు

29 Jun, 2014 01:43 IST|Sakshi
ఆక్వా రైతు కుదేలు
  • భారీస్థాయిలో చేపల మృత్యువాత
  •  వాతావరణ మార్పుతో రైతుల బెంబేలు
  •  హడావుడిగా పట్టుబడులు
  • కలిదిండి : వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరు జల్లులు కురవటంతో   చెరువులలో ఆక్సిజన్ తగ్గి చేపలు మృత్యువాత పడుతున్నాయి.  కలిదిండి మండలంలో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు.

    ఈ ప్రాంతంలో  29వేల ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు ఉండగా,  ఈ నెల 10వ తేదీన వాతావరణ మార్పుల వల్ల 300 టన్నులు చేపలు చనిపోగా రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరలా  శుక్రవారం వాతావరణం చల్లబడి శనివారం ఉదయం వర్షపు జల్లులు కురవటంతో ఆక్సిజన్ లోపం వల్ల   పెదలంక, పెద్దపుట్లపూడి, కొండంగి, లోడిదలంక, పోతుమర్రు, తాడినాడ, చినతాడినాడ, కోరుకొల్లు, సానారుద్రవరం, సంతోషపురం, అమరావతి, గుర్వాయిపాలెం, మూలలంక గ్రామాల్లోని చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలాయి.  

    అప్పారావుపేట గ్రామంలో ఒక రైతుకు చెందిన చెరువులో 3టన్నుల చేపలు  చనిపోయాయి. దీంతో రైతులు అయినకాడికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో హడావుడిగా పట్టుబడులు కానిచ్చేస్తున్నారు.  25 నుంచి 30 ఎకరాల్లో సుమారు 30 టన్నులు చేపలు మృత్యువాత పడ్డాయని రైతులు తెలిపారు. రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లింది. అదే విధంగా వాతావరణ మార్పుల వల్ల వనామి రొయ్యలు మృత్యువాత పడటంతో రైతులు వర్షంలోనే పట్టుబడులు సాగించారు. వ్యవ ప్రయాశలకోర్చి  సాగు చేస్తుంటే.. ఏటా  వాతావరణ మార్పుల వల్ల  తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని  ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని  కోరుతున్నారు.
     
    మండవల్లి  మండలంలో..
     
    ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలలో చేపల సాగు జరుగుతోంది. ఒక్కసారిగా  చేపలు మృత్యువాత పడి గట్ల వెంబడి తేలుతుతుండటంతో చేపల చెరువుల రైతులకు దిక్కుతోచడం లేదు. వివిధ మందులు చెరువులో పిచికారి చేస్తున్నప్పటికీ ఏవిధమైన ఉపయోగం లేదంటున్నారు. అమ్ముదామన్నా తగిన ధర లేదని ఆవేదన చెందుతున్నారు.
     

>
మరిన్ని వార్తలు