ఫలించిన ఉమ పోరాటం..!

17 Dec, 2013 04:23 IST|Sakshi
పలాస, న్యూస్‌లైన్:  పలాస కాపువీధికి చెందిన జామి ఉమ  న్యాయపోరాటం ఫలించింది. కులపెద్దల జోక్యంతో ఆమె భర్త ఎట్టకేలకు దిగివచ్చాడు. భార్యతో  కాపురం చేసేందుకు అంగీకరించాడు. ఈ మేరకు కాశీబుగ్గలో తెలగకుల సంఘం పెద్దల సమక్షంలో ఇరుకుటుంబాలు అంగీకరిస్తూ రాజీపత్రంపై సంతకాలు చేశాయి.  దీనికి సంబంధించిన వివరాలు  ఇవీ..విజయనగరం సారిక గ్రామానికి చెం దిన ఉమకు, పలాసకు చెందిన జామి బాబూరావుతో 2010 జూన్ 24న వివాహం జరిగింది. వారికి హేమలత అనే పాప జన్మించింది. ఉమ కాన్పుకోసం కన్నవారింటికి వెళ్లింది. బిడ్డపుట్టి రెండేళ్లయినా..భర్త నుంచి పిలుపు రాకపోవడంతో..భర్తను వెతక్కుంటూ.. పలాస చేరుకుంది.
 
 ఈనెల 4న కాపువీధిలోని  బాబూరావు ఇంటికి  వెళ్లగా కుటుం బీకులు ఆ ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్లిపోయారు. దీంతో ఉమ ఇరుగుపొరుగు వారి సహకారంతో కాపువీధిలోని భజన మందిరంలో ఉంటూ న్యాయపోరాటానికి దిగింది. ఈ విష యం పోలీసులకు తెలిసినా..ఉమ వారికి తన భర్తపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా తనకు న్యాయం చేయాలని, తన భర్తతో కలిసి కాపురం చేసేందుకు  సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కులపెద్దలు రంగప్రవేశం చేశారు. పలాస తెలగకుల సంక్షేమ సంఘానికి చెందిన  కుల పెద్దలు సీహెచ్ శ్యామలరావు, పుట్టా లోకనాథం, జి.వెంకటరమణ, బాబ్జి, బుదిరెడ్డి ప్రతాప్, టి.వెంకటరమణ, జి.వెంకటరమణ, 
 
 వాసు తదితరులు సమక్షంలో ఉమ తల్లి పద్మావతి, ఉమ భర్త బాబూరావుతో పాటు సోదరులు జామి రామారావు, భాస్కరరావు తది తరులు  సమస్యను పరిశీలించి పరిష్కరించారు. విడిపోవడానికి కావలసిన విభేదాలు వారి మధ్య లేవని, చిన్న చిన్న లోపాల కారణంగా ఇటువంటి తేడాలు వచ్చాయని గమనించిన పెద్ద లు, కుటుంబీకులు వారిని ఒక ఆరునెలలు పాటు ప్రత్యేకంగా ఒక అద్దె ఇంట్లో కాపురం చేయాలని సూచిం చారు. ఈ ప్రతిపాదనకు  ఇరువర్గాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా ఉమ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తన భర్త చాలా మంచివాడని, ఆయనతో బతకాలన్నదే తన ఆశ అని పేర్కొంది. తమను కలిపిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపింది.
 
మరిన్ని వార్తలు