ఆ..శ్రమ పడాల్సిందేనా..

7 Mar, 2019 08:47 IST|Sakshi
సీతంపేటలో అరకొర సిబ్బందితో అవస్థలు

గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో         అవే కష్టాలు

వేధిస్తున్న వంట సిబ్బంది కొరత

మరో నెల రోజుల్లో

ముగియనున్న విద్యాసంవత్సరం

శ్రీకాకుళం , సీతంపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాసిరక భోజనమే అందుతోంది. రుచీపచీ లేని కూరలు, రసంతో తినలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా చాలీచాలనీ వంట సిబ్బందితో వండి పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈ పోస్టుల భర్తీలో మీనమేశాలు లెక్కించడంతో తప్పడం లేదు.
జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 5,176 వేల మంది బాలురు, 5,188 మంది బాలికలు చదువుతున్నారు. మొత్తం 11 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 16 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మూడు పూటలా భోజనం వండి పెట్టాల్సి ఉంది.
ఇందుకుగాను మొత్తం 203 మంది అవసరం కాగా, 113 మంది మాత్రమే ఉన్నారు. 90 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. వంటమనుషులు 29, సహాయకులు 33, వాచ్‌మెన్లు 28, ఆఫీస్‌ సభార్డినేట్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వంటశాలలు సైతం 15 పాఠశాలల వరకు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి...
స్థానిక ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలతోపాటు మారుమూల గ్రామాల్లోని వసతి గృహాల్లోనూ ఇబ్బందులు తప్పడంలేదు. సీతంపేట బాలికల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వండి వడ్డించడానికి ఇద్దరు వంటమనుషులు, మరో ఇద్దరు సహాయకులు, నైట్‌వాచ్‌వుమెన్‌ ఉండాలి. ఒక వాచ్‌మెన్, కుక్‌ మాత్రమే ఉన్నారు. పూతికవలసలో 500ల మందికి పైగా విద్యార్థులు ఉండగా ఒక వంట మనిషే ఉన్నారు. పొల్ల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇంతవరకు నైట్‌వాచ్‌మెన్‌ లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే  శంబాం, హడ్డుబంగి, చిన్నబగ్గ తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

నిలిచిన పోస్టుల భర్తీ..
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో గిరిజన విద్యకు కల్పిస్తున్న మౌలిక వసతులకు పొంతన లేకుండా పోయింది. మూడేళ్ల  క్రితం ఖాళీ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నప్పటకీ పైరవీలు చోటు చేసుకోవడంతో మధ్యలో నిలుపుదల చేశారు. పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల పరిస్థితి మరీ దారుణం. అక్కడ పోస్టులే మంజూరు కాకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వసతిగృహ సంక్షేమాధికారులు సొంత డబ్బులు వెచ్చించి ప్రయివేటుగా వంటమనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం కూడా వచ్చే నెల 23వ తేదీతో ముగియనుంది. అప్పటివరకూ వీరితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఏమన్నారంటే...
ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ భవానీశంకర్‌ వద్ద ప్రస్తావించగా వంటమనుషులు, సహాయకులు, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ఐటీడీఏ పీవో ద్వారా ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వాటి భర్తీకి అనుమతిరావాల్సి ఉందన్నారు.

సమస్య పరిష్కారానికి చర్యలు లేవు
ప్రభుత్వ మొద్దునిద్రతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో వంటవారితోపాటు వంట పాకల సమస్య ఉంది. అది కూడా పరిష్కరించాల్సి ఉంది. ఇప్పట్లో ఇవి పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.– ఎం కనకారావు,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు