కోటి ఆశలు

7 Mar, 2015 01:37 IST|Sakshi

నేటినుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
12న బడ్జెట్ ప్రకటన నిధుల కేటాయింపుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పాలకులు, ప్రజలు

 
ఏలూరు : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను నిరాశపర్చింది. ఈనెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో అయినా జిల్లాకు తగిన స్థాయిలో నిధుల కేటాయిస్తారా లేదా దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌పై అయినా ఆశలు పెట్టుకోవచ్చా.. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఊరించి చివరకు ఉసూరుమనిపిస్తుందా అనే అంశంపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ అంచనాలపై చర్చల అనంతరం ఈనెల 12న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రకటించనున్నారు.

ఈ తరుణంలో అన్ని స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన మన జిల్లాకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని, అభివృద్ధిని దౌడు తీయిస్తామని ఇచ్చిన హామీలకు ఏమైనా కేటాయింపులు ఉంటాయా అనే దానిపై ప్రజాప్రతినిధులు సైతం ఒకింత ఆందోళనతో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రూ.లక్ష కోట్ల విలువైన బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఘనంగా ప్రకటిస్తున్నారు. ఇందులో మన జిల్లా వాటా ఎంతనేది వెల్లడి కావాల్సి ఉంది.

పోలవరం, చింతలపూడి ప్రాజెక్టుల సంగతేంటో!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆటంకాలను తొలగించి జాతీయ హోదా కల్పించింది. 2018 నాటికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని నమ్మబలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించగా, కేంద్రం ఇటీవల రూ.100 కోట్లతో సరిపెట్డడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో అయినా పోలవరం సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లకు తగిన స్థాయిలో నిధులు కేటాయిస్తారా లేక రైతులు వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1,300 కోట్లు కేటాయించి మిగిలిన ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ.1,701 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా ఉంది.

డెల్టా ఆధునికీకరణను పట్టాలెక్కిస్తారా

జిల్లాలో ఇంకా రూ.600 కోట్ల విలువైన డెల్టా ఆధునికీరణ పనులను చేపట్టాల్సి ఉంది. కాలువలు కట్టేశాక ప్రస్తుతం ఉన్న రూ.50 కోట్లతో నిధులతో కాలువలు, డ్రెయిన్ల ఆదునికీకరణ చేయడానికి యంత్రాం గం సన్నద్ధమవుతోంది. మిగిలిన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తారా లేక మొండిచెయ్యి చూపిస్తారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.  ఇదిలావుండగా, జిల్లాలో నిట్‌కు బదులు ఐఐటీ ఏర్పాటు చేస్తామంటున్న సర్కారు బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు చేస్తుంది, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం, నర్సాపురంలో మినీ పోర్టు నిర్మాణంతోపాటు భీమవరంలో ఆక్వా హబ్ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావిస్తారా లేదా అనేవి కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
 
డ్రెయినేజీ అభివృద్ధి సాగేనా


ఏలూరు నగరం వన్‌టౌన్ పరిధిలో భూగర్భ డ్రెయినేజీ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టును ఇంకా రద్దు చేయలేదు. దీనికితోడు రూ.150 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టూటౌన్‌లో రూ.150 కోట్లతో భూగర్భ డ్రెయినేజీని ఆధునికీకరించాలన్న అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. పార్కుల ఆధునికీకరణకు రూ.15కోట్లు, వెంకన్న చెరువు వద్ద ఆధునిక వసతులతో రూ.3 కోట్లతో శ్మశాన వాటికి అభివృద్ధి పెండింగ్‌లోనే ఉన్నాయి. 5వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన 150 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లోనే ఉంది. వీటికి ప్రభుత్వం నిధులిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రూ.6 కోట్లతో గోదావరి నీటిని ఏలూరు మండలంలోని శివారు గ్రామాలకు పైప్‌లైన్ల ద్వారా తరలించే ప్రాజెక్టుకు ఇంకా మోక్షం కలగలేదు. మాస్టర్ ప్లాన్ కింద ఆరు రోడ్లు విస్తరణకు ఈ బడ్జెట్‌లోనైనా మోక్షం కలగాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు