పుష్కరాలకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

23 Jul, 2015 23:31 IST|Sakshi
పుష్కరాలకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

గంటలో చేరుతామనగా ప్రమాదం
యలమంచిలి వద్ద కారు బోల్తా
ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

 
యలమంచిలి :  గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి గాజువాక వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. యలమంచిలి సమీపంలో పెదపల్లి హైవే జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం   వివరాలిలా ఉన్నాయి...నిద్రమత్తులో డ్రైవర్ కళ్లుమూతపడటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న లోయలోకి దూసుకుపోయి చెట్టును ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో ముందు సీటులో కూర్చున్న గాజువాక పంతులుగారి ప్రాంతానికి చెందిన లేళ్ల నర్సింగరావు (55) అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. కారు నడుపుతున్న నర్సింగరావు కొడుకు కుమార్ లేళ్ల శ్రీధర్ రెండుకాళ్లు విరిగిపోయాయి. ఇదే కారులో ప్రయాణిస్తున్న దంపతులు కామశాని రత్నాకరరావు, కామశాని దేవిమణి, గాజువాక సరిగమవైన్స్ యజమాని గూడెల జయరామ్ తీవ్రగాయాలపాలయ్యారు. దేవిమణి తలకు, ఇతర శరీరభాగాలకు బలమైన గాయాలు తగిలాయి.

జయరామ్ రెండుకాళ్లు, చేయి వేరిగిపోయాయి. రత్నాకరరావుకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం మేరకు యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, పట్టణ ఎస్‌ఐ జి.బాలకృష్ణ సంఘటన స్థలానికి  వెళ్లి క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ప్రథమ చికిత్స అనంతరం వారిని గాజువాక సుప్రజా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో దేవిమణి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తరలించినట్టు పట్టణ ఎస్‌ఐ బాలకృష్ణ  చెప్పారు. పోస్టుమార్టం అనంతరం నర్సింగరావు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ బాలకృష్ణ చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు