ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం

14 Jul, 2016 01:09 IST|Sakshi
ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం

దోషులకు శిక్ష పడినప్పుడే  ఆమె ఆత్మకు శాంతి
సీనియర్ న్యాయవాది వైకే

 
గుంటూరు (లక్ష్మీపురం) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ మహమ్మారికి బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి కేసులో దోషులకు శిక్ష పడినప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహ విద్యార్థుల అమానుష చర్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడి గురువారానికి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థులు నిందితులుగా ఉన్న ఆ కేసు విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఈ మేరకు నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారని వివరించారు.


యావజ్జీవ కారాగార శిక్ష పడే ర్యాగింగ్ నిరోధక చట్టం ఐపీసీలోని 306 తదితర సెక్షన్ల కింద కేసు విచారణ జరగనున్నదని తెలిపారు. కేసు విచారణ అసిస్టెంట్ సెషన్సు జడ్జి కాకుండా, సెషన్స్ జడ్జితో చేపట్టాలని కోరుతూ ఫిర్యాదిదారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున కోర్టులో పిటిషన్ వేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. మృతురాలి తండ్రి మురళీకృష్ణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఆర్కిటెక్చర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డిని కలిసి గురువారం రిషితేశ్వరి సంస్మరణను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని కోరారని తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు