‘ఆటో’ ఆయిలింజిన్

16 Jan, 2014 04:35 IST|Sakshi

శాయంపేట, న్యూస్‌లైన్ : రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన ఓ ఆటో మెకానిక్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఆటో ఇంజిన్‌తో ఆయిల్ ఇంజిన్‌ను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. లీటర్ డీజిల్‌తో ఇంజిన్ రెండు గంటలపాటు నడిచేలా తీర్చిదిద్దాడు. రూ.22వేలు ఖర్చయ్యే మోటర్ ఆర్డర్ ఇస్తే తయారు చేస్తానని చెబుతున్నాడు రామ శివప్రసాద్. మండల కేంద్రానికి చెందిన రామ శివప్రసాద్ ఏడో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశాడు.

 అక్కడే రైస్ మిల్లులో డ్రైవర్‌గా చేరాడు. పదిహేనేళ్లపాటు పనిచేశాక కొత్తగా ఆటో మెకానిక్ పని నేర్చుకున్నాడు. పూర్తిగా తర్ఫీదు పొందాక చెట్టు కింద ఆటో బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతేకాక రైతులకు సంబంధించి పెట్రోల్ పంపులు, చైనా మోటర్లను సైతం బాగు చేసేవాడు. ఇలా రైతులు ప్రతిసారి రిపేరుకు తెచ్చే చైనా మోటర్లను చూసి బాధపడేవాడు. విద్యుత్ కోతలు, రైతుల ఇబ్బందులను గమనించిన శివప్రసాద్ ఒక నిర్ణయానికొచ్చాడు. గత వేసవి నుంచి ఆటో ఇంజిన్‌తో కొత్తగా మోటరు తయారు చేయాలని ఆలోచనలో మునిగిపోయాడు.

 ప్రతీ నెల మోటరు తయారు చేయడం.. అందులోని లోపాలను సరిదిద్దుకోవడం ఇలా ఆరు నెలల సమయం పట్టింది. చివరకు అతడి చేతిలో రూపుదిద్దుకున్న మోటరు లీటరు డీజిల్‌తో రెండు గంటలపాటు 7.5 హెచ్‌పీ కంటే అధికంగా నీరు పోస్తోంది. మోటర్‌కు సెల్ఫ్‌స్టార్ట్, 12 ఓల్టేజి బ్యాటరీ, ఆటో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి విజయం సాధించాడు. ఇప్పటికే సుమారు పది మంది రైతులు దీనిని వినియోగించారు. మోటర్ తయారీకి ఇప్పటికీ రూ.22వేలు ఖర్చయినట్లు తెలిపాడు.
 
 బాధలు చూడలేకే..
 రైతులు పడే బాధను చూడలేక కొత్తగా ఆయిల్ ఇంజిన్ తయారు చేశా. ఆటోలో 5 నుంచి పది మంది వరకు ఎక్కించుకున్నా ఇంజిన్ లాగుతుంది. ఇదే ఇంజిన్ బావిలోనుంచి నీటిని లాగలేదా అనే అంశాన్నే ప్రయోగం చేసి విజయం సాధించా. ఇప్పటికే చింతల రవిపాల్‌తోపాటు మరి కొందరు రైతులు దీనిని వాడి చూసి బాగుందన్నారు. రైతులు కావాలంటే ఇలాంటి మోటర్లను ఇంకా తయారు చేస్తా.
 - రామ శివప్రసాద్, మెకానిక్

 ఖర్చు తగ్గుతాంది
 చైనా మోటర్లకంటే ఖర్చు చాలా తగ్గుతాంది. గంటకు అర  లీటర్ డీజిల్‌తో ఏకంగా 120 పైపుల గుండా నీళ్లను తోడుతాంది. మామూలు మోటరు కంటే ఎక్కువగా నీళ్లు పోస్తాంది. 24 గంటలు నడిచిన ఇంజిన్ వేడెక్కుతలేదు. ఇలా ఉంటే రైతులు ఉంటే సిరులు పండించొ చ్చు. - కోల మచ్చయ్య, రైతు

మరిన్ని వార్తలు