అధికారం ఇచ్చే శక్తి యువతకే ఉంది : రామ్‌చరణ్‌

20 Mar, 2017 23:04 IST|Sakshi
అధికారం ఇచ్చే శక్తి యువతకే ఉంది : రామ్‌చరణ్‌

విజయనగరం జిల్లా :  తలుచుకున్న పార్టీకి అధికారం ఇచ్చే శక్తి ఒక్క యువతకే ఉందని సినీ నటుడు రామచరణ్‌తేజ్‌ అన్నారు. మండలం చెరుకుపల్లిలో రెండురోజులుగా నిర్వహిస్తున్న ఆవెన్సిస్‌ 2017 ముగింపు కార్యక్రమానికి ఆదివారం రాత్రి ఆయన వచ్చారు. మధ్యాహ్నం 4.30 గంటలకే రామచరణ్‌ వస్తున్నాడని తెలిసిన యువకులు భారీ సంఖ్యలో అవంతి కళాశాలకు చేరుకున్నారు. అనుకోని కారణాల వల్ల రాత్రి 9గంటలకు వచ్చినా అభిమాన నటుడిని చూసేందుకు యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూశారు.

వారిని ఉత్సాహపరిచేందుకు సినీ నేపథ్యగాయకుడు యజిన్‌నజర్‌ సినీగీతాలతో అలరించారు. రామచరణ్‌ తేజ్‌ రాగానే మెగాస్టార్, మగధీర అంటూ విద్యార్థులు కేకలు పెట్టారు. వారిని అదుపుచేయడం పోలీసుల వల్ల కాలేదు. వేదికమీదకు వచ్చిన రామ్‌చరణ్‌తేజ్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అవంతి కళాశాలకు రావడం, విద్యార్థులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు తలుచుకుంటే జరగనది ఏదీ లేదని, అయితే తలచుకోవడంలేదని అన్నారు. తాను చిన్నప్పటినుంచి స్టార్‌ని కావాలని ఆశపడ్డాను..  

దానిని సాధించడంకోసం చాలా కష్టపడ్డానని అన్నారు. విద్యార్థులను చూస్తుంటే కాలేజ్‌ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అవంతి యాజమాన్యం తనకు సీటు ఇస్తే చదువు సాగిస్తానంటూ చమత్కరించారు. సినిమాల గురించి మాట్లాడుతూ ఖైదీనెం–150 మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. త్వరలో కాటమరాయుడు రానుందని, తను నటిస్తున్న సుకుమారుడు సినిమా కూడా హిట్‌ చేయాలని అన్నారు. అనంతరం పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అవంతి విద్యాసంస్థల చైర్మన్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎండి శ్రావణ్‌ కుమార్, జనరల్‌ సెక్రటరీ ప్రియాంక, ప్రిన్సిపాల్‌లు దివాకర్, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు