డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్

13 Mar, 2015 02:31 IST|Sakshi
డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
  • ఉప ముఖ్యమంత్రితో సంబంధం లేదని వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర గురువారం ఓ మీడియా చానల్ ద్వారా పోలీసులను ఆశ్రయించి డీజీపీ జేవీ రాముడు ముందు లొంగిపోయాడు. అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్‌తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు.

    అవినాష్ ఓ బాధితుడిని గదిలో బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్న వీడి యో బహిర్గతమవడంతో ఈ ఉదంతం  సంచలనం సృష్టించింది. అవినాష్‌పై పలు కేసులు నమోదు కావడం, అతని వ్యవహారం సంచలనం సృష్టించడంతో అరెస్టు చేయడం కోసం తూ.గో. జిల్లా అధికారులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీజీపీ ఎదుట లొంగిపోవడానికి ముందు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఉప ముఖ్యమంత్రితో సంబంధాలు లేవని, కేవలం ఓ కార్యక్రమంలో అనుకోకుండా ఆయన పక్కన కూర్చున్నప్పుడు దిగిన ఫొటోనే మీడియాలో వచ్చిందన్నాడు.

    తాను ఉపముఖ్యమంత్రి పేరును ఎక్కడా వాడలేదని వివరించాడు. గతంలో తనకు సహాయం చేసిన ఓ మహిళా టీచర్ ద్వారా కొందరు కావాలనే వివాదంలోకి లాగారని అవినాష్ ఆరోపించాడు. రాష్ట్రంలో తాను నేతృత్వం వహిస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీలో ఉందని, దాని పూర్తి రికార్డులు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. మీడియాలో హల్‌చల్ సృష్టించిన ‘దాడి వీడియో’ రెండేళ్ల క్రితం నాటిదని చెప్పాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్సై శివకృష్ణలకు ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు