సీబీఐకి  ఆయేషా హత్య కేసు 

30 Nov, 2018 03:09 IST|Sakshi

అసలు దోషులెవరో  తేల్చాలని హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించింది. ఈ కేసుకు సంబంధించిన వస్తు సాక్ష్యాలు (మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌) ఇప్పటికే నాశనమైన నేపథ్యంలో ఈ కేసుకు ఓ తార్కిక ముగింపు తీసుకు రావాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. వస్తు సాక్ష్యాల నాశనం వెనుక ఎవరున్నారు? ఏ ఉద్దేశంతో వారు వాటిని నాశనం చేశారు? తదితర విషయాలను దర్యాప్తులో తేల్చాలంది.

ఆయేషా హత్య, వస్తు సాక్ష్యాల నాశనంపై వేర్వేరుగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కుమార్తె హత్య కేసుపై సిట్‌ చేసే పునర్‌ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేని పక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ శంషాద్‌ బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి దానిని విచారించింది.   

మరిన్ని వార్తలు