నూజివీడు టు లండన్‌

31 May, 2020 13:48 IST|Sakshi

16 టన్నుల బంగినపల్లి మామిడి ఎగుమతి

విశాఖ నుంచి నౌక ద్వారా చేరవేత

లండన్‌కు ఎక్స్‌పోర్ట్‌ ఇదే తొలిసారి  

సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మామిడి తొలిసారిగా లండన్‌ పయనమైంది. 16 టన్నుల నాణ్యమైన బంగినపల్లి మామిడి పండ్లను శనివారం వేకువజామున నూజివీడు నుంచి కంటైనర్‌లో విశాఖ పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా నౌకలో లండన్‌ చేరుకుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు ప్రకాశం జిల్లా ఉలవపాడు ఏరియాలో పండిన బంగినపల్లి మామిడిని అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎపెడా) ద్వారా విజయనగరానికి చెందిన ఓ ఎగుమతి దారు కొనుగోలు చేశారు. ఈ మామిడిని నూజివీడు లోని ఇంటిగ్రెటెడ్‌ ప్యాక్‌ హౌస్‌లో గ్రేడింగ్‌ చేశారు. నాణ్యతకు అవసరమైన ప్రక్రియను అక్కడ ఉన్న వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో పూర్తయ్యాక 5 కిలోల చొప్పున అట్టపెట్టెల్లో వీటిని ప్యాక్‌ చేసి కంటైనర్‌లో పేర్చారు. 

ఏసీ కంటైనర్‌ ద్వారా..

  • మామిడి పండ్లను రైతులు, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో శనివారం వేకువజామున కంటైనర్‌లో విశాఖపట్నం పోర్టుకు పంపారు. 
  • అక్కడ నుంచి నౌకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్‌ కండిషన్డ్‌ కంటైనర్‌లో లండన్‌కు పంపుతారు. 
  • విశాఖపట్నం నుంచి లండన్‌కు నౌక చేరుకోవడానికి 28 రోజుల సమయం పడుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచడడం వల్ల మామిడి పాడవదు. 
  • ఇన్ని రోజులు సరకు పాడవకుండా ఉండేందుకు ప్యాక్‌ హౌస్‌లో ముందుగానే పెస్టిసైడ్‌ ట్రీట్‌మెంట్‌ కూడా చేశారు.
  • 16 టన్నుల మామిడిని విశాఖ నుంచి లండన్‌ చేరవేసేందుకు నౌక యాజమాన్యం 2,500 డాలర్లు వసూలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు