పాతవి చెల్లిస్తేనే కొత్త రుణాలు

23 Aug, 2014 02:31 IST|Sakshi
పాతవి చెల్లిస్తేనే కొత్త రుణాలు

* బ్యాంకర్ల స్పష్టీకరణ
* రుణమాఫీపై ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్య
* గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్థిక సాక్షరత్‌పై ప్రచారం ప్రారంభం

 
సాక్షి, హైదరాబాద్: పాత రుణాలు చెల్లించినవారికే కొత్త రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) వర్గాలు స్పష్టంచేశాయి. రుణమాఫీపై ఇప్పుడు తాము ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్థిక సాక్షరత (ఫైనాన్స్ లిటరసీ) ప్రచార కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రారంభించింది. అంతకుముందు నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్థిక సాక్షరతపై సదస్సు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్, ఎస్‌ఎల్‌బీసీ-ఏపీ కన్వీనర్ సి.దొరైస్వామి మాట్లాడుతూ.. రిజర్వ్‌బ్యాంకు మార్గదర్శకాల మేరకు పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలను మంజూరు చేయగలమని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రతీ ఇంట్లో ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోం దని.. ఇందుకోసం ఆగస్టు 28న ప్రధాని నరేంద్రమోడీ ‘జన్ ధన్ యోజన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ఇందులో భాగంగానే నాబార్డు ఆర్థిక సాక్షరత ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోందని వెల్లడించారు. ఏపీలో 93 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండగా.. తెలంగాణలో ఇది 95 శాతానికిపైగానే ఉందన్నారు.

మరిన్ని వార్తలు