బాపట్ల పార్లమెంట్‌పై  పట్టెవరిది..?

22 Mar, 2019 13:14 IST|Sakshi

గడిచిన ఐదేళ్లలో  నియోజకవర్గం వైపు చూడని తాజా మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి

 వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎంపికలో విశిష్టత చాటుకున్న వైఎస్‌ జగన్‌

సుడిగాలి పర్యటనలు చేస్తున్న నందిగం సురేష్‌ 

సాక్షి, చీరాల: బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం. ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానం. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి, మాజీ కేంద్రమంత్రులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, ప్రముఖ సినీనిర్మాత దగ్గుబాటి రామానాయుడు, రాజకీయాలలో సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి రాజకీయ దిగ్గజాలు ఏలిన గడ్డ. అయితే, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బాపట్ల పార్లమెంట్‌ను ఎస్సీలకు కేటాయించారు. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉండగా, మరో మూడు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దళిత సామాజికవర్గం అధికంగా ఉండే బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది.


ఇప్పటి వరకూ 10 సార్లు ఎన్నికలు...
బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరగ్గా, ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్‌ బరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత ఎంపీ శ్రీరాం మాల్యాద్రి బరిలో ఉన్నారు. 2014లో ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో ఐదు సార్లు కూడా నియోజకవర్గాన్ని చుట్టపు చూపు కూడా చూడలేదని శ్రీరాం మాల్యాద్రిపై విమర్శలున్నాయి.

దీంతో ఈసారి పార్లమెంట్‌ పరిధిలోని ఓటర్లు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. సామాన్యుడైన నందిగం సురేష్‌కు ఎంపీ టికెట్‌ను ఖరారు చేసి విశిష్టతను చాటుకున్న వైఎçస్‌ జగన్‌పై ఓటర్లు, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీలలో మాల సామాజికవర్గానికే అన్ని పార్టీలు ఇక్కడ సీట్లు కేటాయిస్తున్న తరుణంలో.. మాదిగ సామాజికవర్గానికి చెందిన సురేష్‌కు ఎంపీ సీటును వైఎస్‌ జగన్‌ కేటాయించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు, ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ – టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. 


మొత్తం 13,88,240 మంది ఓటర్లు...
బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం 13,88,240 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలు 7,50,029 మంది, పురుషులు 6,83,099 మంది, ఇతరులు 117 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 20 సంవత్సరాల్లోపు ఉన్న ఓటర్లు 68 వేల మంది ఉన్నారు. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు (ఎస్సీ), గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు (ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడిని సైతం బాపట్ల ప్రజలు ఓడించిన చరిత్ర ఉంది.

‘నందిగం’కు అందివచ్చే అవకాశాలివే...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ టికెట్‌ను గుంటూరు జిల్లా ఉద్దండరాయిని పాలేనికి చెందిన నందిగం సురేష్‌కు కేటాయించారు. 2018లో బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా పార్టీ అధిష్టానం అతన్ని ప్రకటించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర నుంచి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా అధికార టీడీపీ చేస్తున్న అక్రమాలపై సురేష్‌ పోరాటాలు చేశారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడిగా, మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడిగా కీలకంగా విధులు నిర్వహించడంతో పాటు పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

టీడీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు. నందిగం సురేష్‌కు చీరాల, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విస్తృతంగా ఉన్న పరిచయాలు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో వ్యవహరించే తీరు, కార్యకర్తలకు అండగా ఉండటం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తిచూపేలా పనిచేయడం కలిసి వచ్చే అంశాలు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనను కూడా నందిగం సురేష్‌తోనే వైఎస్‌ జగన్‌ చేయించి అతనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీలపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న జగన్‌కు, సురేష్‌కు అన్నివిధాలా ఓటర్లు సహకారం అందించనున్నారు.  

మాల్యాద్రిపై భగ్గుమంటున్న ప్రజలు...

టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి పట్ల బాపట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014లో బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందిన అనంతరం పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాలను సంవత్సరానికి ఒక్కసారి కూడా ఆయన పలకరించిన పాపానపోలేదు. చాలా నియోజకవర్గాలలో మాల్యాద్రి పట్ల ఉన్న వ్యతిరేకత, క్లిష్ట సమయాల్లో కార్యకర్తలను విస్మరించడం వంటి తీరుతో విమర్శలపాలయ్యారు. బాపట్ల నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేసింది ఏమీ లేదు. కేవలం సుజనాచౌదరికి చెందిన వ్యాపారాలకే మాల్యాద్రి పరిమితమై నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకోవచ్చు. దీంతో ప్రజల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత వచ్చింది. కేవలం ఎన్నికల సమయంలోనే ముందుకు వస్తారన్న భావన ప్రజల్లో ఉంది. బాపట్ల పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. 

బాపట్లను ఏలింది వీరే...

బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఇప్పటికి జరిగిన ఎన్నికల్లో ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ విజయం సాధించాయి. 1977నుంచి 80 వరకు పి.అంకినీడు ప్రసాద్‌ (కాంగ్రెస్‌), 1980–84 వరకు పి.అంకినీడు ప్రసాద్‌ (కాంగ్రెస్‌), 1994లో చిమటా సాంబు (టీడీపీ), 1989–91 వరకు సలగల బెంజిమెన్‌ (కాంగ్రెస్‌), 1991–96 వరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు (టీడీపీ), 1996–98 వరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (టీడీపీ), 1999–2004 వరకు దగ్గుబాటి రామానాయుడు, 2004–2009 వరకు దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్‌), 2009–2014 వరకు పనబాక లక్ష్మి (కాంగ్రెస్‌). 2014–19 వరకు శ్రీరాం మాల్యాద్రి (టీడీపీ) ఎంపీలుగా పనిచేశారు. 

మరిన్ని వార్తలు