బాసూ.. మాకు మెమొరి లాసూ..!

28 Sep, 2014 02:14 IST|Sakshi
బాసూ.. మాకు మెమొరి లాసూ..!

హా
 రాత్రి చాలాసేపు చదువుకుని పడుకున్న హృషికేష్ మరుసటి రోజు ఉదయం హడావిడిగా నిద్రలేచాడు. ఉదయం 11 గంటలకు పరీక్ష. 10.45కి బస్సెక్కాడు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోని పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నాడు. బాగా చదవడంతో ఎలాంటి ప్రశ్నలొచ్చినా బ్రహ్మాండంగా రాయగలనన్న ధీమాతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతోనే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తుండగా గేట్‌మన్ ఆపాడు. హాల్‌టికెట్ చూపించాలన్నాడు. హృషికేష్ అన్ని జేబులు వెతికినా కనిపించలేదు. బిక్కముఖం వేశాడు. అతన్ని పరీక్షకు అనుమతించలేదు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాయలేకపోయాడు. మతిమరుపు వల్ల ఒక సంవత్సరం వృథా అయ్యింది.
 
 హా
 వేణుగోపాల్ మెడికల్ రెప్రజెంటేటివ్. అనంతపురం నగరంలోని ఓ ప్రముఖ నర్సింగ్‌హోంకు వెళ్లారు. డాక్టర్ అపాయింట్‌మెంటు తీసుకుని, తమ కంపెనీకి సంబంధించిన మందుల గురించి వివరించారు. రూ.30 వేలు విలువజేసే మందులకు ఆర్డర్ తీసుకున్నారు. అయితే.. సకాలంలో మందులు సరఫరా చేయలేదు. దీంతో డాక్టర్ వేరే కంపెనీ మందులు కొనుగోలు చేశారు. మతిమరుపు వల్ల మందులు సరఫరా చేయలేకపోయిన వేణుగోపాల్‌కు ప్రమోషన్ ఆగిపోయింది.

 సాక్షి, అనంతపురం:
 కాలం మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానమూ పెరుగుతోంది. కాలంతో పాటు మనిషి పరుగు తీస్తున్నాడు.  పనిఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు పీడిస్తున్నాయి. దీంతో వ్యసనాలకు బానిస అవుతున్నారు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, అతిగా సెల్‌ఫోన్ వినియోగం, అతిగా మాంసాహారం తినడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మతిమరుపునకు గురవుతున్నారు.
  రోజువారీ వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాలను మరచిపోయే జబ్బు చాలా మందికి ఉందట. ప్రత్యేకించి యువత ఈ జబ్బుతో సతమతమవుతోందని వైద్యులు అంటున్నారు. పని ఒత్తిడి, వ్యసనాలే ఇందుకు ప్రధాన కారణాలని వారు చెబుతున్నారు.
 రెండు రకాలుగా జ్ఞాపకశక్తి
 మనిషి మెదడులో రెండు రకాలైన మెమొరీ (జ్ఞాపకశక్తి) ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణ ప్రకారం..స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఉంటాయి. జీవితంలో జరిగే అరుదైన సంఘటనలు, చదువు, కష్టాలు, నష్టాలు, అనుభవాలు దీర్ఘకాలిక మెమొరీలో ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు స్వల్పకాలిక మెమొరీలో ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలిక మెమొరీ ద్వారానే మనిషి దినచర్య సాగుతుంది. దీని ప్రభావం మెదడులోని నరాలపై ఉంటుంది. దీనివల్ల పనిఒత్తిడి పెరిగి రోజువారీ విషయాల్లో మతిమరుపు ఉంటోంది.
 యువతపై ఎక్కువ ప్రభావం
 జిల్లా జనాభాలో 20 శాతం వరకు యువత ఉన్నారు. 15 శాతం అంటే దాదాపు ఆరు లక్షల మంది మెమొరీలాస్ సమస్యలతో బాధపడుతున్నారని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరు 15-30 ఏళ్ల మధ్య వయస్కులు.  జీవితంలో ఏదో సాధించాలనే ఆలోచనలు వీరి మెదడుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో మూడు పదుల వయసు దాటకుండానే అనేక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. లైంగిక సమస్యలు కూడా యువ కుల్లో ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
 పరిష్కారం లేదా?
 ఈ సమస్యలకు పరిష్కారం ఉంది. మంచి అలవాట్లు అలవరచుకోవడం, యోగా వంటివి సాధన చేయడం, సెల్‌ఫోన్ వినియోగం తగ్గించడం ద్వారా మతిమరుపును అధిగమించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



 

మరిన్ని వార్తలు