విజయవాడలో సీఎం విస్తృత పర్యటన

28 Sep, 2014 01:57 IST|Sakshi
విజయవాడలో సీఎం విస్తృత పర్యటన
  • విజయవాడలో సీఎం విస్తృత పర్యటన
  •  మేధా టవర్, టూరిజం కార్యాలయ భవనాల పరిశీలన
  •  సప్తగిరి చానల్పారంభోత్సవం, టూరిజం డే వేడుకలకు హాజరు
  •  దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
  • సాక్షి, విజయవాడ : ‘ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాలు ఏమిటి.. సిద్ధంగా ఉన్న భవనంలో తక్షణం ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. టూరిజం కార్యాలయం ఉన్న  భవనంలో ఎన్ని అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. మేధా టవర్ పరిస్థితి ఏమిటి.. అక్కడ ఎన్ని కార్యాలయాలకు అనుకూలంగా ఉంటుంది...’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    శనివారం విజయవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడిపారు. అయినప్పటికీ ఆయన దృష్టి మొత్తం రాజధాని ఏర్పాటుపైనే ఉందనే విషయం అధికారులను అడిగిన ప్రశ్నలను బట్టి అర్థమవుతోంది. షెడ్యూల్ కన్నా ఐదు నిమిషాలు ముందుగానే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 7.30 గంటల వరకు బిజీబిజీగా గడిపారు. పలు ప్రారంభోత్సవాలు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అధికారులతో సమీక్షలు, పలు భవనాల పరిశీలన ఇలా ఆద్యంతం సీఎం పర్యటన బిజీబిజీగా సాగింది.
     
    డీడీ సప్తగిరి ప్రారంభం: కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య

    నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు గన్నవరం చేరుకున్నారు. వారికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గౌరవార్థం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు.

    అక్కడ నుంచి దూరదర్శన్ కేంద్రానికి చేరుకుని డీడీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సప్తగిరి చానల్‌ను ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిహ్నాన్ని,  వీణానాదం సీడీని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఎ1-కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సప్తగిరి చానల్ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రసార భారతి సీఈవో జవహర్ సర్కార్, సప్తగిరి కేంద్రం డెరైక్టర్ విజయలక్ష్మి ఛాబ్రా, దూరదర్శన్ సప్తగిరి డెప్యూటీ డెరైక్టర్ జనరల్ శైలజా సుమన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగరి, తెనాలి నాలుగు మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భవించనున్న తరుణంలో డీడీ ప్రసారాలు ఇక్కడ ప్రారంభించటం అభినందనీయమని, ప్రజలకు అవసరమైన నాణ్యమైన వార్తలు ప్రసారం చేయాలని సూచించారు.
     
    స్టేట్ గెస్ట్‌హౌస్‌లో...

    అక్కడ నుంచి నేరుగా స్టేట్ గెస్ట్‌హౌస్‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పలు సంఘాల నేతలు, వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. రాజధాని నిర్మాణం కోసం వీటీపీఎస్ ఫ్లైయాష్ బ్రిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీ సుబ్బారావు, కె.శ్రీనివాసరావు రూ.15 లక్షల చెక్కులను విరాళంగా అందజేశారు. పూల వర్తక గుమాస్తా సంక్షేమ సంఘ నేతలు రూ.10,116,  ది కృష్ణా డిస్ట్రిక్ట్ టైలర్స్ అసోసియేషన్ నేతలు రూ.3లక్షలు, బందరు మండలం గుండుపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు తూమాటి బసవశంకరరావు రూ.25 వేల నగదును విరాళాలుగా సీఎంకు అందించారు. అనంతరం నగరపాలక సంస్థ ఉద్యోగులు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని సీఎంకు  వినతిపత్రం సమర్పించారు.
     
    టూరిజం డే వేడుకల్లో..

    భవానీ ఐలాండ్‌లో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు అవార్డులు అందజేశారు.  అక్కడ నుంచి నేరుగా గన్నవరం పయనమయ్యారు. మార్గమధ్యంలోని మేధా టవర్ భవనాన్ని పరిశీలించారు. అక్కడ వసతులు, సౌకర్యాలను జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
     
    ప్రముఖల హాజరు..

    సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, వల్లభనేని వంశీ, కాగిత వెంకట్రావు, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, చైతన్యరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు, నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, నగర మున్సిపల్  కమిషనర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ సుజనశ్రీ తదితరులు పాల్గొన్నారు.
     
    అధికారులతో సమావేశం

    మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. రాజధాని ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్న మేధా టవర్ వివరాలను, బ్లూప్రింట్‌ను పరిశీలించారు. టూరిజం కార్యాలయ భవనం ప్లాన్ గురించి చర్చించారు. అనంతరం సీఎం నేరుగా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

    మార్గమధ్యంలో టూరిజం కార్యాలయం ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. ఆ భవన వివరాలను సీఎంకు కలెక్టర్ వివరించారు. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. క్యూలైనులో ఉన్న భక్తులతో సీఎం మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు.
     
    విన్నపాలు... అభినందనలు..

    విజయవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.
     
    పలు సాంకేతిక కళాశాల విద్యార్థులు ‘విజయవాడ నీడ్స్ యు’ పేరుతో నగర పరిశుభ్రతకు ప్రణాళికలు తయారుచేసి ఏలూరు ఎంపీ మాగంటిబాబు ఆధ్వర్యంలో సీఎంను కలిసి అందించారు.  
     
    ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో రోలర్ స్కేటింగ్‌లో రజత పతకం సాధించిన బి.జశ్వంత్‌కుమార్ ముఖ్యమంత్రిని కలిసి తాను పొందిన పతకాన్ని చూపించగా, సీఎం అభినందించారు.
     
    ఈ నెల 30 నుంచి స్పెయిన్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో పాల్గొననున్న దాసరి అలేఖ్యకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
     
    సదరం క్యాంపులలో వికలాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పిచాలని, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 30వ డివిజన్‌కు చెందిన మదర్ థెరీసా వికలాంగుల సంక్షేమ సంఘం  ప్రతినిధి డి.మోహన్‌కుమార్ సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
     
    తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్పొరేషన్  ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు దారా రాంబాబు, సూరిబాబు, సాంబశివరావు తదితరులు సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు.
                 
    - విజయవాడ

>
మరిన్ని వార్తలు